మీడియా రంగాన్నీ కరోనా కుదుపులకు గురి చేస్తోంది. కరోనా వల్ల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఉద్యోగాలు కోల్పోయారు పాత్రికేయులు. ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టుల్ని కరోనా వెంటాడుతోంది. ఇటీవల కరోనాతో టీవీ 5 క్రైమ్ రిపోర్టర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కొంతమంది మీడియా మిత్రులకూ కరోనా సోకినట్టు నిర్దారణ అవుతోంది. ఈటీవీ, టీవీ9, ఏబీఎన్ లాంటి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులలో కొంతమందికి కరోనా లక్షణాలు ఉండడంతో.. యాజమాన్యాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా నమస్తే తెలంగాణ లో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది. దాంతో ఓ ఫ్లోరు ఫ్లోరంతా ఖాళీ చేసినట్టు సమాచారం. ఆ ఉద్యోగితో సంబంధాలున్న మిగిలిన ఉద్యోగుల్నీ హోం క్వారెంటెన్లో ఉంచినట్టు తెలుస్తోంది. ఎడిటర్ స్థాయి ఉద్యోగులూ ఇప్పుడు హోం క్వారెంటెన్కి పరిమితమైనట్టు సమాచారం. కనీసం 20 నుంచి 30 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయిస్తున్నారని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటేనే పాత్రికేయులు భయపడుతున్నారు.