ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి డబ్బులు ఆదా చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది కానీ..కొన్ని కొన్ని చోట్ల ఇది వికటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొన్ని కొన్ని చోట్ల.. రెండింతల రేటుకు రద్దు చేసిన పనులను ఇతరులకు కేటాయిస్తున్నారు. అవి టెండర్లు పిలిచి కట్ట బెడుతున్నారో… మరో రూపంలో ఇచ్చేస్తున్నారో కానీ.. అప్పుడప్పుడు ఇలాంటివి బయట పడుతున్నాయి. మొన్నటికి మొన్న కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో… రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఆ ఆర్డర్‌కు టెండర్లు లేవు. రచ్చరచ్చ కావడంతో.. తక్కువ రేటే ఇస్తామని చెప్పుకొచ్చారు. అంతటితో ఆ ఎపిసోడ్ అయిపోయింది కానీ.. కొత్తగా…108 అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్ట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీని కరోనా టెస్టింగ్ కిట్ల కంటే ఎన్నో రెట్లు పెద్దది. ఈ 108అంబులెన్స్‌ల వ్యవహారం చాలా ఆసక్తికరంగా ఉంది.
108 అంబులెన్స్ నిర్వహణ రివర్స్ కాంట్రాక్ట్‌లో గోల్మాల్..!
గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 అంబులెన్స్ నిర్వహణను.. ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అందించడంలో ప్రముఖ కంపెనీగా ఉన్న బీవీజీ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి అప్పగించింది. 2018లో ఐదేళ్ల కాలానికి ఒప్పందం జరిగింది. ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు.. నెలకు రూ. లక్షా 31వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. మొత్తంగా 300 అంబులెన్స్‌లను బీవీజీ సంస్థ నిర్వహిస్తుంది. ఇలా మొత్తం ఐదేళ్లకు కలిపి రూ.235కోట్ల వరకూ అవుతుంది.
బీవీజికి క్యాన్సిల్ చేసి అరబిందోతో అత్యధిక ధరకు ఒప్పందం..!
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అంటే.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత…బీవీజీ సంస్థకు ఇచ్చిన 108 అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. తక్కువ ధరలకు ఇస్తారేమో అని అందరూ అనుకున్నారు. దాదాపుగా రెట్టింపు ధరలకు… అరబిందో ఫార్మాకు అప్పగించారు. ప్రస్తుతం ఉన్న 300 అంబులెన్స్‌ల నిర్వహణకు నెలకు రూ. లక్షా 78వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. కొత్తగా ఏపీ ప్రభుత్వం మరో 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది.వాటి నిర్వహణకు రూ. 2 లక్షల 21వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అంటే పాత అంబులెన్స్‌ల నిర్వహణకు రూ.320 కోట్లు.. కొత్త వాహనాల నిర్వహణకు రూ.545 కోట్లు అరబిందో సంస్థకు…ప్రభుత్వం చెల్లించబోతోంది. మొత్తంగా రూ. 865కోట్ల రూపాయలు.
విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి ప్రయోజనం కల్పించడానికేనా..?
ఈ మొత్తం వ్యవహారంలో…విజయసాయిరెడ్డికి లింక్ పెట్టి..కన్నా లక్ష్మినారాయణ.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. బీవీజీ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుని అంత కన్నా ఎక్కువ మొత్తానికి అరబిందో సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తక్కువ ధరకు వస్తోన్న సేవల్ని కాదని భారీగా ధరలు పెంచి చెల్లించడంపై సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఈ కాంట్రాక్టుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో ఛైర్మన్ రామ్‌ప్రసాద్ రెడ్డి పాత్ర తేల్చాలని డిమాండ్ చేశారు.