2020-21 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను రూ.2,24,789.18 కోట్లతో రూపొందించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మొత్తం రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లుగా తేల్చారు. సవరించిన అంచనాల ప్రకారం గత ఏడాది రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు మాత్రమే. ఈ సారి తొలి నాలుగు నెలలు పూర్తిగా ఆదాయం పడిపోయినా..కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లు భారీగా తగ్గే అవకాశం ఉన్నా.. రెవిన్యూ వ్యయాన్ని దాదాపుగా యాభై వేల కోట్లు ఎక్కువగా చూపారు. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు. ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు.
బుగ్గన బడ్జెట్ ప్రసంగం అంతా పూర్తిగా వివిధ పథకాలకు నిధుల కేటాయింపుతోనే సాగింది. ప్రధాన పథకాలన్నింటికీ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. సామాజిక పెన్షన్లకు రూ.16వేల కోట్లు, అమ్మఒడి పథకానికి రూ.6వేల కోట్లు, చేయూత పథకానికి రూ.3వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు కేటాయించాు. గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46 కోట్లు, వైఎస్ఆర్ రైతుభరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు కేటాయించారు. ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు, గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు కేటాయించినట్లుగా ప్రకటించారు. కానీ అవన్నీ పథకాల్లో భాగంగానే ఇవ్వబోతున్నారని…తెలుస్తోంది. ఈ లెక్కలు.. ఆ ప థకాలకు కేటాయించిన లెక్కలు కలిపితే.. బడ్జెట్ లెక్కలు ఎక్కువ అయిపోతున్నాయి.
అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్ల రూపాయలు ఇస్తామని గత బడ్జెట్లో చెప్పారు.కానీ ఇచ్చింది రూ.264 కోట్లు. ఇప్పుడు మరో రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభించాలనుకున్న పలు పథకాలకు నిధులు కేటాయించారు. అయితే.. ఆదాయం విషయంలో మాత్రం.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్లో పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేకపోయారు. రూ.2,24,789.18 కోట్ల ఆదాయం ఎలా వస్తుందో… గత లోటును ఎలా పూడ్చుతారో మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ వనరులపై ప్రసంగం చేయలేదు. ప్రభుత్వం విడుదల చేసిన బుక్‌లోనూ ఆ ప్రస్తావన కనిపించలేదు.