శాసనమండలిలో ఇరుక్కుపోయిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లుల విషయంలో ఏపీ సర్కార్.. ఎవరూ ఊహించని.. స్టెప్ వేసింది. ఆ బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం .. న్యాయ,రాజ్యాంగ నిపుణులందర్నీ ఒక్క సారిగా నిశ్చేష్ఠుల్ని చేసింది. ఎందుకంటే.. ఓ అంశానికి సంబంధించిన బిల్లులు…పెండింగ్లో ఉండగానే అవే బిల్లులు మళ్లీ పెట్టడం.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయం మరి.
ప్రస్తుతం పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలిలో ఉన్నాయి. శాసనమండలి ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాల్సి ఉంది. కార్యదర్శి చైర్మన్ ఆదేశాలను పాటించలేదు. దీంతో కార్యదర్శి చైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం సభ్యుడు దీపక్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శాసనమండలి కార్యదర్శికి హైకోర్టు నోటీస్ లు ఇచ్చింది. ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే.. ప్రభుత్వం కూడా.. హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయని చెప్పింది. ఇప్పుడు కొత్త స్టెప్ తీసుకుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ ఆలోచన…చట్టం,రాజ్యాంగం గురించి కాస్తంత తెలిసిన వరిని కూడా బిత్తరపోయేలా చేస్తోంది. బిల్లుల వివాదం కోర్టు పరిధిలో, గవర్నర్ వద్ద ఉండగా, మళ్లీ ప్రవేశపెట్టడం సబ్ జ్యుడిస్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ బిల్లులు మళ్లీ శాసనమండలికి వెళ్లాల్సి ఉంది. అక్కడ ఇప్పటికే పరిస్థితుల్ని ఏమైనా మార్చుకున్నారని.. మరికొంత మంది ఎమ్మెల్సీలతో చర్చలు జరిపారని అందుకే ధైర్యంగా బిల్లులు పెట్టారన్న చర్చ జరుగుతోంది. పనిలో పనిగా.. హైకోర్టు కొట్టేసి..సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిన పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా…వైసీపీ సర్కార్ ఆమోదింపచేసుకుంది.