నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అసలు తగ్గట్లేదు. తన బొమ్మ పెట్టుకుని గెలుస్తానని.. దమ్ముంటే.. తన నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్లీ జగన్ బొమ్మ పెట్టుకుని గెలవాలని ఆయన సవాల్ చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎదురుదాడి ప్రారంభించిన తర్వాత రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. ఆయనపై చర్యలు తీసుకోలేక… ఎదురుదాడి చేస్తే.. కాస్త సైలెంట్ అవుతారని అనుకున్నారేమో కానీ.. వ్యూహం ప్రకారం.. అందరితోనూ రఘురామకృష్ణంరాజుపై విమర్శల వర్షం కురిపించారు. కానీ అందరికీ… చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శల కన్నా.. ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన విమర్శలే వైరల్ అవుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యేలు.. రకరకాల దందాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో తన నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో.. రఘురామకృష్ణంరాజు వివరించారు. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారనే.. విపక్ష నేతల విమర్శలకు.. రఘురామకృష్ణంరాజు మాటలతో మరింత బలం చేకూరినట్లయింది. అంతటితో వదిలి పెట్టని నర్సాపురం ఎంపీ .. టీవీ చర్చల్లోనూ.. తనదైన వాదన వినిపించారు. వైసీపీ నేతల లాంగ్వేజ్‌లోనే తిట్ల వర్షం కురిపించారు. ప్రభుత్వం అసెంబ్లీలో తమ ప్రగతిని గొప్పగా చెప్పుకుంది. సంక్షేమ పథకాల కేటాయింపులను హైలెట్ చేసుకుంది. కానీ అవేమీ హైలెట్ కావడం లేదు.. రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ మాత్రమే.. ట్రెండింగ్‌లో ఉంది.
రఘురామకృష్ణంరాజును ఎందుకు ఉపేక్షిస్తున్నారో వైసీపీ నేతలకే అర్థం కావడం లేదు. మాస్క్ లేదని అడిగినందుకు ప్రభుత్వ డాక్టర్ అయిన సుధాకర్‌ను అప్పటికప్పుడు సస్పెండ్ చేసిన జగన్.. తన పార్టీ ఎంపీ.. తననే ధిక్కరిస్తూ.. పార్టీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తూంటే.. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. సహజంగా ఇలాంటి సందర్భాల్లో టీడీపీకి అమ్ముడుబోయారనే ఆరోపణలు చేస్తారు. కానీ రఘురామకృష్ణంరాజు మీద అలా చేయలేకపోతున్నారు. ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారని నమ్మడమే ఆయనపై నేరుగా చర్యలు తీసుకోకపోవడానికి కారణం అంటున్నారు. మొత్తానికి వైసీపీ హైకమాండ్ సైతం సాల్వ్ చేయలేని సమస్యగా నర్సాపురం ఎంపీ వ్యవహారం మారిపోయింది.