ఒక్కడే కొడుకు. సరిహద్దుల్లో పొరుగు దేశం కుట్రకు బలయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రుల మానసిక స్థితిని అంచనా వేయడం కష్టం. దేశంలో జరుగుతున్న పరిణామాల్ని… రాజకీయ నేతల ఆరాచకాల్ని కళ్ల ముందు చూస్తూ.. ఇలాంటి దేశం కోసమా.. నా కొడుకు ప్రాణాలు ఇచ్చింది అనే… ఓ రకమైన నిర్వేదం రావడం ఖాయం. కానీ.. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ తల్లిదండ్రులు మాత్రం అలాంటివేమీ మనసులోకి రానీయలేదు. దేశం కోసం తమ బిడ్డ ప్రాణాలు అర్పించాడంటే… గర్వంగానే ఉందని.. చెప్పారు. కానీ తల్లిదండ్రులుగా మాత్రం.. వారి మానసిక వేదను.. వర్ణించడం సాధ్యం కాదు.
కోరుకొండ సైనిక్ స్కూల్లో చదవి.. లెఫ్ట్‌నెంట్ హోదాతో సైన్యంతో అడుగుపెట్టి… కేవలం పదిహేనేళ్ల సర్వీస్‌లోనే కర్నల్ స్థాయికి సంతోష్ కుమార్ ఎదిగారు. ఆయన విధి నిర్వహణ పట్ల ఎంత సీరియస్‌గా ఉంటారో.. ఎంత నిబద్ధతతో ఉంటారో.. ఇదే తెలియచెప్పేస్తుంది. ఆయన కుటుంబం సంతోష్ మరణ వార్త విని… షాక్‌కు గురయింది కానీ… దేశం కోసం ప్రాణాలు అర్పించారనే విషయం మాత్రం.. కాస్త గుండె దిటవు చేసుకునేలా చేసింది. ఏదైనా దేశం తర్వాత.. అది ప్రాణం అయినా కూడా.. అన్న నమ్మకాన్ని ఆ కుటుంబం మొదటి నుంచి పాటిస్తోంది. సంతోష్ మరణవార్త విన్న తర్వాత వారి గుండె నిబ్బరం అదే చెబుతోంది.
సరిహద్దుల్లో ఇంత వరకూ పాకిస్తాన్ మాత్రమే.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేది. ఇప్పుడు కొత్తగా చైనా కూడా.. తయారయింది. చైనా సరిహద్దుల్లో నాలుగున్నర దశాబ్దాల నుంచి ఎలాంటి ఘర్షణాత్మక వాతావరణం లేదు. కానీ ఇప్పుడు.. భారత్‌ను.. డిస్ట్రబ్ చేయాలన్న ఉద్దేశంతోనే.. చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. అక్కడి కమ్యూనిస్టు పార్టీకి తెలియకుండా.. సరిహద్దుల్లో ఇలాంటికార్యక్రమాలు జరగవు. పై స్థాయిలో ఆమోదం పొందిన తర్వాతే చేస్తారు. అంటే.. ఈ వివాదం ఇంతటితో ఆగిపోదు.. ఇంకా.. చాలా చాలా ఘటనలు ఉంటాయి. దేశాన్ని రక్షించుకోవడంలో.. సంతోష్ లాంటి ఎంతో మంది సిద్ధంగా ఉంటారు. వారి స్ఫూర్తే దేశానికి రక్షణకవచంగా ఉంటుంది…!