తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇచ్చి చాలా రోజులైంది. కానీ ఒకట్రెండు చిన్న సినిమాలు మినహాయిస్తే… షూటింగుల హడావుడి పెద్దగా కనిపించలేదు. స్టార్లు షూటింగులకు రావడానికి భయపడుతుండడంతో… పెద్ద సినిమాలేవీ సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో టాలీవుడ్ ఇప్పటికీ కళావిహీనంగా, వర్క్లెస్గా కనిపిస్తోంది. అయితే షూటింగులు మొదలుకాకపోవడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది.కొత్త సినిమాలేవీ మొదలుపెట్టొద్దని, ఇప్పటికే చిత్రీకరణలు జరిగి, 20 – 30 శాతం బాకీ ఉన్న సినిమాలు పూర్తి చేసుకోమని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అందులోనూ పాయింట్ ఉంది. కరోనా వల్ల పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. కొత్త సినిమా మొదలెడితే, ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు ఆపేయాల్సివస్తుందో చెప్పలేని పరిస్థితి. తెలిసి తెలిసి ఊబిలోకి దిగడం ముమ్మాటికీ తప్పే. అందుకే.. కొత్త సినిమాల్ని ఆపేసి, నిర్మాతలపై భారం తగ్గించడం సమంజసమైన నిర్ణయమే. ఇప్పటికే సినిమాలు మొదలెట్టి, చిత్రీకరణలు తుది దశలో ఉన్నవాళ్లైతే.. వీలైనంత త్వరగా తమ సినిమాల్ని పూర్తి చేసుకోవడం మంచిది. మరో పది, ఇరవై రోజులు పనిచేస్తే, షూటింగులు పూర్తవుతాయి అనుకున్నవాళ్లే… చిత్రీకరణలు మొదలెట్టాలని ప్రొడ్యూసర్ గిల్డ్ అభిప్రాయపడుతోంది. ఒకవేళ ‘మా సినిమా మా ఇష్టం’ అని ఏ నిర్మాత అయినా అనుకుంటే, ఆ సినిమాకొచ్చే సమస్యల విషయంలో ప్రొడ్యూసర్ గిల్డ్ కలగచేసుకోదని స్పష్టంగా చెప్పేసిందట.
సినిమా నిర్మాణం అనేది త్రిశంకు స్వర్గంలో ఉందిప్పుడు. కరోనా వల్ల భయపడిపోతూ… చిత్రీకరణలు ఆపలేరు. అలా ఆగితే…. ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తాయి. అలాగని చిత్రీకరణలు జరపడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. సినిమా పూర్తయినా, థియేటర్లు లేకపోతే… ఏం లాభం? వచ్చిన కాడికి ఓటీటీకి అమ్ముకోలేక, థియేటర్లు లేక, వడ్డీలు కట్టుకోలేక మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఓటీటీ కోసమే సినిమా తీస్తున్నాం, అనుకుంటే మాత్రం అలాంటివాళ్లతో ఎలాంటి ఇబ్బందీ లేదు. థియేటర్ రిలీజే లక్ష్యం అయితే మాత్రం… ఇంకాసేపు ఎదురు చూడక తప్పదు.