మంత్రి అచ్చెన్నాయుడుకి గుంటూరు జనరల్ హాస్పిటల్లో రెండోసారి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తెల్లవారుజామునే.. మెడికల్ రెస్ట్‌లో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడమే కాదు.. పద్దెనిమిది గంటల పాటు కారులో తిప్పారు. దీంతో ఆయన ఆపరేషన్ గాయం తిరగబెట్టింది. అరెస్ట్ చేసిన రోజు.. ఆస్పత్రికి తరలించినా.. ఆ గాయం తగ్గలేదు. రక్తస్రావం అవుతూనే ఉంది. దీంతో కంగారుపడిన వైద్యులు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అటు కోర్టుకు.. ఇటు ఉన్నతాధికారులకు తెలియచేస్తూ వస్తున్నారు. చివరికి మళ్లీ ఆపరేషన్ చేయకపోతే.. ఇన్ ఫెక్షన్ పెరిగి పరిస్థితి సీరియస్ అవుతుందన్న అంచనాకు రావడంతో.. ఉన్నతాధికారులు అచ్చెన్నకు రెండో సారి ఆపరేషన్ చేయాలని ఆదేశించారు. దాంతో వైద్యులు.. అచ్చెన్నకు ఆపరేషన్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
అచ్చెన్నను మామూలుగానే అరెస్ట్ చేయడం అక్రమం అని టీడీపీ వాదిస్తోంది. ఇప్పుడు పోలీసుల అత్యుత్సాహం వల్ల.. ఆయనకు రెండో సారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో.. పోలీసులల్లోనూ.. అరెస్టుల విషయంలో దుందుడుకుగా వ్యవహరించిన అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. పదో తేదీన రాత్రి కేసు నమోదు చేసి.. హుటాహుటిన పన్నెండో తేదీన తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అదీ కూడా నోటీసులు ఇవ్వలేదు. పోలీసుల అదుపులో ఉన్నప్పుడే 41A నోటీసులు ఇచ్చారని.. తన అరెస్ట్ అక్రమం అని.. అచ్చెన్నాయుడు కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి .. అరెస్ట్ వల్లే దిగజారడంతో… మరింత వివాదాస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు సంబంధించి ఏసీబీ అధికారులు ఒక్క లేఖను మాత్రమే ఆధారంగా చూపిస్తున్నారు. ఈఎస్ఐ వ్యవహారంలో మంత్రికి నేరుగా ఎలాంటి ప్రమేయం ఉండందని.. సూచనలు మాత్రమే.. చేస్తూ లేఖలు రాస్తారని ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న వారంతా ఇప్పటికే తేల్చేశారు. అయితే.. ఏసీబీ అధికారులు మాత్రం… కేసు నమోదు చేసిన ఒక్క రోజులోనే అరెస్ట్ చేసి.. పూర్తి ఆధారాలు ఉన్నాయని మీడియాకు చెబుతున్నారు. ఉరిశిక్ష వేసే వారికి కూడా.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని.. అచ్చెన్నాయుడు ఏం చేశారని ఆపరేషన్ జరిగిన తర్వాతి రోజే బలవంతంగా అరెస్ట్ చేశారని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం న్యాయస్థానం దృష్టికి అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.