తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసును పోలీసులు నమోదు చేశారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ.. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆమె ఫిర్యాదే కాస్త భిన్నంగా ఉంది. అయ్యన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియా పోస్టింగ్స్‌లో కనిపించిందని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. అయ్యన్న ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఎవరో పోస్ట్ పెడితే.. దానికి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు.. ఏకంగా నిర్భయ కేసు నమోదు చేసేశారు పోలీసులు.
నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం ఉండేది. దాన్ని అధికారులు తొలగించారు. మునిసిపల్ కార్యాలయంలో ఆ చిత్రపటాన్ని మళ్లీ పెట్టాలంటూ.. గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు. అక్కడకు అయ్యన్న వచ్చి సంఘిభావం తెలిపారు. అక్కడ మాట్లాడారు. అయితే.. అయ్యన్న మాట్లాడారో లేదో కానీ.. కమిషనర్ బట్టలిప్పదీస్తామన్నారంటూ.. కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ఆ ప్రచారం ఆధారంగానే అయ్యన్నపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. నిర్భయ కేసు పెట్టారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడిపై అనేక రకాల ఫిర్యాదులతో.. కేసులు నమోదు చేశారు. పెళ్లికి వెళ్లినా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసులు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడిని కూడా.. రేపోమాపో అరెస్ట్ చేస్తారని.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… అత్యంత కఠినమైన నిర్భయ సెక్షన్ల కింద కేసు పెట్టడం… ఖచ్చితంగా అరెస్ట్ కోసమేనన్న చర్చ జరుగుతోంది.