సరిహద్దుల్లో ఇరవై మంది భారత సైనికుల్ని చైనా దళాలు చంపేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ అయ్యారు. చైనా రెచ్చగొట్టే చర్యలకు బదులిచ్చే సత్తా ఉందని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్విగ్న పరిస్థితి నేపధ్యంలో ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమరులైన సైనికుల త్యాగాలు వృధా కాబోవని ప్రకటించారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం వంటి విషయాల్లో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. భారత్ శాంతిని కోరుకుంటుందని అలా అని రెచ్చగొడితే.. చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. త్యాగాలు, వెనుకడుగు వేయకపోవడం..ధైర్య సాహసాలు మన జాతి లక్షణాలు అని మోడీ చెప్పుకొచ్చారు.
చైనా దుందుడుకు చర్యలపై మోడీ సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన పందొమ్మిదో తేదీన సాయంత్రం… అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ సహా.. మొత్తం ఘటనను వివరించనున్నారు. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు ఆయన మద్దతు అడగనున్నారు. గతంలో.. కశ్మీల్లో పుల్వామాలో బాంబు దాడి జరిగినప్పుడు… ఇలాగే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా.. మద్దతిస్తామన్న హామీని పొందారు. ఆ తర్వాతే పాకిస్తాన్‌పై సర్జికల్ స్టైక్స్ చేశారు. పెద్ద ఎత్తున తీవ్రవాద క్యాంపుల్ని ధ్వంసం చేశామని.. ఆనాడు ప్రభుత్వం ప్రకటించుకుంది.
ఇప్పుడు చైనా అంత కంటే.. ఎక్కువగా భారత సార్వభౌమత్వంపై దాడి చేస్తోంది. నేరుగా కాల్పులు జరపకపోయినా.. అత్యంత క్రూరంగా సైకనికుల్ని కొట్టి చంపింది. ఇది క్షమించరానిదిగా.. భారత సమాజం భావిస్తోంది. చైనా విషయంలో ఏ మాత్రం.. మెత్తగా ఉన్నా.. ఆ దేశం మరింత దుందుడుకుగా.. ఉంటుందని.. మన శాంతిని .. చేతకాని తనంగా భావిస్తుందన్న చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి మోడీ తో పాటు.. సలహాదారులు కూడా అదే భావనలో ఉన్నారంటున్నారు. చైనాకు ఇప్పుడు ధీటుగా సమాధానం చెబితేనే చొరబాట్లు ఆగిపోతాయని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం.. భారత్‌వైపే ఉంటుందని.. దూకుడుగా సర్జికల్ స్టైక్స్ తరహా చర్యలు తీసుకోవాలన్న సూచనలు కేంద్రానికి పెద్ద ఎత్తున వెళ్తున్నాయి.