జాతీయవాదం పేరుతో తనదైన శైలి దేశభక్తిని తన టీవీ చానల్ చూసేవాళ్లలో రగిలించడంలో రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామిది ప్రత్యేకమైన శైలి. ఓ రకంగా ఆయన శత్రువుగా డిక్లేర్ చేసుకున్న దేశంపై టీవీ స్టూడియో నుంచే యుద్దం ప్రకటించేస్తారు. ఎక్కువగా ఆయన హిట్‌లిస్ట్‌లో పాకిస్థాన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చైనా వచ్చి చేరింది. నిన్నంతా ఆయన చైనా వస్తువులను బహిష్కరించాలనే పిలుపును తన టీవీ చానల్ ద్వారా ఇచ్చారు. దానిపై రోజంతా.. కార్యక్రమాలు నిర్వహించారు. డిబేట్లు పెట్టారు. దీనికి కారణం ఏమిటో మనందరికీ తెలుసు. సరిహద్దుల్లో భారత సైనికుల్ని చైనా చంపేసింది.
ఈ కారణంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయడం భారత్ చేతిలోనే ఉందని.. తక్షణం ఆ దేశ ఉత్పత్తులను వాడకం నిలిపివేయడం.. యాప్స్ ను డిలీట్ చేయడం చేయాలని ఉద్యమం ప్రారంభించారు. ఇది ఆర్నాబ్ స్టైల్ కాబట్టి.. నచ్చిన వాళ్లు ఉత్కంఠగా చూశారు… వితండవాదం అనుకున్న వాళ్లు పక్క చానల్‌కు పోయారు. అందులో విశేషం ఏమీ లేదు కానీ.. అసలు బాయ్‌కాట్ చైనా అంటూ రోజంతా నిర్వహించిన కార్యక్రమాలన్నింటికీ స్పాన్సర్ చైనా కంపెనీలు కావడమే…ఇక్కడ అసలు మతలబు. పవర్ బై వీవో.. అంటూ ఓ అడ్వర్టైజ్ మెంట్ రోజంతా ఉంది. షియోమీ ఎం 10 బగ్ రోజంతా కనిపించింది.
దీన్ని చూసిన తర్వాత ఆర్నాబ్‌కు అంత దేశభక్తి ఉంటే.. ముందుగా తన చానల్లో చైనా కంపెనీల ప్రకటనలు తీసుకోవడం ఎందుకు మానేయలేదన్న అభిప్రాయం వినిపించింది. సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు వేశారు. మార్కెటింగ్ చేసుకోవడానికి దేశభక్తి అంశాన్ని ప్రమోట్ చేస్తున్నారని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అయితే.. ఇలాంటివి ఒక్క రిపబ్లిక్ టీవీనే కాదు.. ఏ టీవీ చానల్ కూడా పట్టించుకోలేదు.. వాటి మార్కెటింగ్ వారిదే.. అది చైనా కంపెనీలయినా డోంట్ కేర్..!