రాజమౌళి.. అపజయమెరుగని దర్శక ధీరుడు. తన ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. స్కెచ్ వేశాడంటే తిరుగుండదు. టెక్నికల్‌గా యమ సౌండు. అలాంటి రాజమౌళికే లాక్ డౌన్ పరిమితుల మధ్య షూటింట్ చేయడం సాధ్యం కాలేదు.
లాక్ డౌన్ నుంచి షూటింగులకు మినహాయింపు ఇవ్వాలని చిత్రసీమ ముందు నుంచీ గట్టిగా కోరుతూ వచ్చింది. షరతుల మధ్య షూటింగులు చేయడం సాధ్యమే అని, గైడ్ లైన్స్‌ని పాటిస్తూ, షూటింగులు పూర్తి చేస్తామని.. దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. కావాలంటే ఓ ట్రైల్ షూట్ చేసి, చూపిస్తాం అంటూ రాజమౌళి మాటిచ్చాడు. లాక్ డౌన్ నిబంధనల మేర షూటింగులు ఎలా చేసుకోవొచ్చో చెప్పడానికి తన ట్రైల్ షూట్ ఓ రిఫరెన్స్ గా ఉంటుందని రాజమౌళి భావించాడు. ప్రభుత్వం కూడా సరే అంది. అయితే.. ట్రైల్ షూట్ జరక్క ముందే.. షూటింగులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది.
ప్రభుత్వం కోసం కాకపోయినా, హీరోల్ని ఒప్పించడానికి, వాళ్లలో ధైర్యాన్ని నింపడానికి, కనీసం తనకు తాను క్లారిటీ తెచ్చుకోవడానికైనా ట్రైల్ షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు రాజమౌళి. ఎన్టీఆర్, చరణ్‌ల డూప్లతో కొన్ని షాట్లు తీసి – ఆ మొత్తం తతంగాన్ని షూట్ చేసి, హీరోలకు చూపిద్దామనుకున్నాడు. నిజానికి సోమవారం ట్రైల్ షూట్ ప్రారంభం అవ్వాలి. ఆ రోజు వాయిదా పడి, బుధవారానికి చేరింది. బుధవారం కూడా ట్రైల్ షూట్ చేయలేదు. ఇప్పుడు మొత్తంగా ట్రైల్ షూట్ చేయాలన్న ఆలోచనే విరమించుకున్నాడట రాజమౌళి. నిబంధనల మేరకు షూటింగ్ చేయడం కుదరని పని అనే విషయం రాజమౌళి కి ఇప్పుడు బోధపడినట్టుంది. పెద్ద స్టార్లతో.. 40 – 50 మంది క్రూతో షూటింగ్ అనేది జరగని విషయం అనే క్లారిటీకి రాజమౌళి వచ్చాడట. చిన్న సినిమాలైతే ఓకే, ఏదోలా సర్దుకోవొచ్చు. పెద్ద సినిమాలకైతే ఎంత మందిని కుదించుకుంటూ వెళ్లినా ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ తో షూటింగులు చేయలేమన్న నిర్దారణకు రాజమౌళి వచ్చేశాడు. దాన్ని బట్టి ఆచార్య, పుష్ష, ఎఫ్ 3 ఇలాంటి పెద్ద సినిమాలేవీ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్సు లేనట్టే.
షూటింగుల అనుమతుల వల్ల లాభపడింది ఎవరైనా ఉన్నారంటే.. అవి ఛానళ్లే. టీవీ సీరియళ్లూ, కొన్ని షోలూ.. ఇప్పటికే మొదలైపోయాయి. వచ్చే సోమవారం నుంచి సీరియళ్లు మొదలు కానున్నాయి. షోలూ… యధావిధిగా ప్రదర్శించడానికి ఛానళ్లు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.