“ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమనే” అహింసా వాద సిద్దాంతంతో నాడు మహాత్ముని ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పోరాటం జరిగింది. అది అప్పటికే భారత్‌ను ఆక్రమించుకున్న వారిపై జరిగిన పోరాటం. అప్పుడు ఏం జరిగినా భారతీయులే నష్టపోతారన్న ఉద్దేశంతో మహాత్ముడు ఈ దారి ఎంచుకున్నారు. కానీ.. ఇప్పుడు చైనాతో..అదీ కూడా భారత్‌ను ఆక్రమించుకోవాలుకుంటున్న వారితో జరుగుతోంది పోరాటం. వారు ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయించాలన్న హింసా సిద్ధాంతాన్ని ఎంచుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీసి.. మన భూభాగంలోకి వచ్చి.. మన సైనికుల్నే క్రూరంగా చంపేంత సాహసం చైనా చేసిందంటే… అంతకు మించి భయంకరమైన ప్రణాళికలు ఆ దేశానికి ఉన్నాయని భావించాలి.
ఆక్రమణే చైనా లక్ష్యం..!
చైనా జనాభాలోనే కాదు.. విస్తీర్ణంలో కూడా పెద్ద దేశం. కానీ నియంతల ఆధీనంలో ఉండే ఆ దేశం ఎప్పుడూ… విస్తరణ కాంక్షతో రగిలిపోతూ ఉంటుంది. పొరుగు దేశాల్ని.. పొరుగు దేశాల్లోని భాగాల్ని తమవని చెప్పుకుంటూ.. వివాదాలు సృష్టి స్తూ ఉంటుంది. చైనా దుందుడుకు కబ్జాలకు కళ్ల ముందు కనిపించే సాక్ష్యాలు.. టిబెట్… తైవాన్. ఈ రెండు దేశాలూ తమవేనని చైనా వాదిస్తూ ఉంటుంది. భౌగోళికంగా ఉన్న అనుకూలతలో.. వాటిని తమ కబంధ హస్తాల్లో బంధించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ దేశాలు.. సర్వం ఒడ్డి తమ ఉనికి కోసం పోరాడుతున్నాయి. భారత సైనికుల్ని చంపేసిన తర్వాత తైవాన్… చైనా ఎలాంటి ఉద్దేశంతో ఈ దాడులకు పాల్పడిందో.. చాలా స్పష్టంగా తన దేశ మీడియాలో వెల్లడించింది. పకడ్బందీ వ్యూహంతోనే… దేశాన్ని ఆక్రమించే లక్ష్యంతోనే.. ఈ ఘటనలతో గ్రౌండ్ సిద్ధం చేసిందని తైవాన్ నమ్ముతోంది. టిబెట్ చైనా చేతుల్లో చిక్కుకుని స్వేచ్చ కోసం పరితపిస్తోంది. టిబెట్ వాసులు దైవంగా భావించే దలైలామా… ఆ దేశంలో ఉంటే… ప్రాణాలతో ఉండలేరనే భయంతో… మన దేశంలోని ధర్మశాలలో తలదాచుకుంటూ ఉంటారు.
ఉదాసీనంగా ఉంటే లద్దాఖ్.. అరుణాచల్ ప్రదేశ్లు చేజారిపోతాయి..!
కల్నర్ స్థాయి అధికారితో పాటు ఇరవై మంది జవాన్లను.. కర్కశంగా చంపారంటే… చైనా స్కెచ్ చిన్నది కాదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. మా వైపు కూడా ప్రాణ నష్టం జరిగిందని చైనా వాదిస్తోంది కానీ.. తప్పంతా భారత్ వైపు నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడే చైనా కుటిల ప్రయత్నాలు బయటపడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు .. కశ్మీర్లో కేంద్రం కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసిన లద్దాఖ్పైనా గురి పెట్టినట్లుగా అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని.. చైనా ఇటీవలి కాలంలో ఎక్కువగా వాదిస్తోంది. అయితే.. దీనికి దీటుగా భారత్.. చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా చెబుతోంది. పార్లమెంట్లో కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 చట్టాన్ని రద్దు చేసినప్పుడు.. అర్పిస్తామని అమిత్ షా ఎమోషనల్ అయ్యారు. ఆక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా నుంచి స్వాధీనం చేసుకుంటామని.. దీని కోసం ప్రాణాలైనా ఇస్తామని ప్రకటించారు. అప్పట్లో చైనా కూడా.. ఆక్సాయ్ చిన్ వ్యవహారాన్ని ప్రస్తావించిన వెంటనే చైనా కూడా తవ్ర స్థాయిలో స్పందించింది. భారత ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్లుగా అనిపించింది కానీ.. చైనా మాత్రం.. తన స్కెచ్‌ను కొనసాగిస్తోందని.. తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.
దెబ్బకు దెబ్బతీయాలి..! అంతకు మించి ఎక్కువే చేయాలి..!
చైనాకు ఇప్పుడు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. చైనా ఆర్థిక బలాన్ని సైనిక సంపత్తిని చూసి.. భయపడబోమని.. అంతకు అంత సమాధానం చెబుతామని నిరూపించాల్సిన సమయం వచ్చింది. అది .. సరిహద్దుల్లో సైనిక పరంగా… ఇటు దౌర్య పరంగా.. చివరిగా వాణిజ్య పరంగా కూడా.. చైనాను ఏకాకిని చేయగలగాలి. సరిహద్దుల్లో ఇక నుంచి చైనా కూడా.. ఉగ్రవాదాన్ని ఎగదోసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ దేశం నీతి అంతే ఉంటుంది. వాటిని దీటుగా ఎదుర్కోవాలంటే.. సర్జికల్ స్టైక్స్ తరహా ఘటనలతో బుద్ది చెప్పాలి. ఇలా చెప్పే ముందు దేశం… అంతర్జాతీయంగా మద్దతు సంపాదించాలి. చైనాపై ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ దేశం ఇస్తున్న అప్పులు.. ఆర్థిక వ్యవహారాలపై ఆధారపడిన వారు తప్ప.. మిగిలిన వారందరూ.. చైనాను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు చైనాపై అసంతృప్తిగా ఉన్నాయి. వారంతా భారత్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఈ మద్దతును సమర్థంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. వాణిజ్య పరంగా చైనాకు భారత్ అతి పెద్ద మార్కెట్. చిన్న గుండు సూది నుంచి సెల్ ఫోన్ల వరకూ.. మేడిన్ చైనా .. మన మార్కెట్‌ను ముంచెత్తుతోంది. చైనా సంస్థలు.. భారత ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలిగే పరిస్థితులకు వెళ్లాయి. బాయ్ కాట్ చైనా క్యాంపెయిన్ టీవీ చానళ్లలో వస్తూంటే.. పవర్డ్ బై వీవో.. ఒప్పో అని యాడ్స్ రావడమే దీనికి సంకేతం. బీసీసీఐ కూడా.. వీవోతో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేమని తేల్చేసింది. అంటే.. పాలు, నీళ్లలా కలిసిపోయి.. ఆర్థిక వ్యవస్థను సైతం చైనా పిండేస్తోందన్నమాట. ప్రస్తుతం భారత్‌లో వినియోగిస్తున్న వస్తువుల్లో.. ఏది మేడిన్ చైనానో.. ఏది మేడిన్ ఇండియాదో అర్థం కాని పరిస్థితి. ఓ మాల్కి వెళ్లి స్ఫూన్లు కొన్నా… అవి మేడిన్ చైనానే అయి ఉంటున్నాయి. ఇక సెల్ ఫోన్ల సంగతి చెప్పనవసరం లేదు. భారత్‌లో తయారీ రంగం అనుకున్నంత వృద్ధి సాధించకపోవడానికి చైనా నుంచి వచ్చే దిగుమతులే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా హిందువుల పండుగల వస్తే… అసలు పండుగ చేసుకునేది చైనానే. అందుకే… దిగుమతుల్ని పరిమితం చేసి.. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాల్సిన అవసరం పడింది.
భారత సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులపైనే..!
స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్ని చూసింది. అయితే చైనా వైపు నుంచి నేరుగా ముప్పు వచ్చిన సందర్భాలు తక్కువ. కానీ చైనా పాకిస్థాన్‌ను ఎగదోసి.. దేశంలో అశాంతి సృష్టిస్తోంది. ఇప్పుడు పాకిస్థాన్‌తో పాటు నేపాల్‌ను.. శ్రీలంకను కూడా ఉసిగొల్పుతోంది. అంతా అయ్యాక.. తాను కూడా.. దాడి చేస్తోంది. ఇది ఓ రకంగా.. భారత సార్వభౌమత్వాన్ని చైనా సవాల్ చేయడమే అవుతుంది. ఇప్పుడు.. ఏం చేసినా… దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి… కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఏం చేసైనా సరే… భారత సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం… కేంద్రంపై ఉంది. ఈ విషయంలో ప్రజలు తమ వంతు మద్దతు ఇస్తారు. ఇక కేంద్రానిదే ఆలస్యం. చైనాకు గట్టిగా బుద్ది చెప్పి.. ఆక్సాయ్‌చిన్‌ను స్వాధీనం చేసుకుంటే… ఆ తర్వాత పాకిస్థాన్ కూడా దారిలోకి వస్తుంది. పీవోకేను.. భారత్‌లో చేర్చితే.. ప్రధాని మోడీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారు. చైనా మరోసారి భారత్ జోలికి రావాలని కూడా అనుకోదు. మోడీ, షా ఇది చేసి చూపిస్తారని ప్రజలు కూడా నమ్ముతున్నారు. దాని కోసమే ఎదురు చూస్తున్నారు.