చైనా విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు అఖిలపక్ష భేటీని నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో వర్చువల్ పద్దతిలో జరిగే ఈ అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల అభిప్రాయాలను.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా… ఈ అఖిలపక్ష భేటీలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. దాదాపుగా అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులూ ఈ సమావేశంలో పాల్గొంటారు. చైనా విషయంలో భారత్ వ్యూహం ఎలా ఉండాలన్నదానిపై… సలహాలు తీసుకుంటారు.
చైనా ఇప్పటికే భారత్లో ఆక్రమణలకు పాల్పడుతోంది. గాల్వన్ నది ఇప్పటికే తమదని వాదించడం ప్రారంభించింది. లద్దాఖ్.. అరుణాచల్ ప్రదేశ్లపైనా పంజా విసరబోతోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. చైనాకు దూకుడుగా సమాధానం చెబితేనే.. నిలువరించగలమని భావిస్తున్నారు. చైనాను నిలువరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నా… ప్రజలంతా మద్దతు పలికే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు ఏం చేయాలో చెప్పి… తమ మద్దతు ఉంటుందని కేంద్రానికి హామీ ఇచ్చే అవకాశం ఉంది. దేశభద్రతకు సంబంధించిన విషయం కాబట్టి.. ఇక్కడ రాజకీయాలకు తావుండే అవకాశం లేదు.
కరోనా విషయంలో లాక్ డౌన్ విధించినప్పుడు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఫోన్లు చేసి మాట్లాడారు. సలహాలు తీసుకున్నారు. కానీ ఒక్క చంద్రబాబుకు మాత్రం ఫోన్ చేయలేదు. అయితే.. చంద్రబాబు అలాంటిదేమీ మనసులో పెట్టుకోకుండా… స్వయంగా తానే ఫోన్ చేసి.. ప్రధానితో మాట్లాడాలనుకుంటున్నారని పీఎంవోకు చెప్పారు. తర్వాత ప్రధానితో మాట్లాడారు. కొన్ని సూచనలు పంపించారు. అయితే కరోనా అంతర్గత వ్యవహారం.. ఇప్పుడు.. చైనా ఇష్యూ.. దేశమంతా కలసి కట్టుగా చేయాల్సిన పోరాటం. అందుకే ఈ సారి మోడీ.. అన్ని రాజకీయ పార్టీలతోనూ మాట్లాడుతున్నారు.