శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో.. జీతాలు, పెన్షన్లు ఆలస్యమవుతాయన్న ఆందోళన నిన్నంతా వ్యక్తమయింది. అయితే.. అలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితేనే బడ్జెట్ ఆమోదం పొందినట్టవుతుంది.ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవటంతో ప్రభుత్వానికి బడ్జెట్ కు సంబంధించిన నిధుల వ్యయంలో వీలుకాదని ఆందోళన చెందారు. ఆ తర్వాత రాజ్యాంగ నిపుణులు దీనిపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆర్థిక బిల్లు. అలాగే దీన్ని శాసనమండలిలో ప్రవేశపెట్టారు కూడా.
శాసనమండలిలో ఆమోదించినా.. ఆమోదించకపోయినా… 14 రోజుల తర్వాత ఆ బిల్లు ఆమోదం పొందినట్టుగానే పరిగణిస్తారు. ఈ విషయం స్పష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. ఆమోదించినా, ఆమోదించకపోయినా మనీ బిల్ కావటంతో 14 రోజుల తర్వాత ఆటోమెటిక్ గా బిల్ పాస్ అవుతుందని ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మీడియాకు చెప్పారు. శాసనమండలిలో ఈ నెల 17వ తేదీన నిరవధిక వాయిదా పడటంతో 14 రోజుల తర్వాత అంటే జూన్ 30వ తేదీ సాయంత్రంతో ఆ గడువు పూర్తవుతుంది.
14 రోజుల అనంతరం బిల్ ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతుండటంతో జూన్ 30వ తేదీ సాయంత్రం నుంచి బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఖర్చు చేసుకొనే సౌలభ్యం ప్రభుత్వానికి కలుగుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అదే రోజు.. గవర్నర్తో సంతకం పూర్తి చేయిస్తే.. ఒకటో తేదీనో జీతాలు… పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆలస్యంగా ఇవ్వాల్సి వస్తే.. టీడీపీ వల్ల ఆగిపోయాయనని.. చెప్పే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది.