ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు.. ఘన విజయం సాధించారు. ఒక్కొక్కరికి ఆ పార్టీ నేతలు 38 ఎమ్మెల్యేలను కేటాయించారు. ఆ మేరకు ఎమ్మెల్యేలంతా పకడ్బందీగా ఓట్లు వేశారు. ఒక్క ఓటు కూడా.. అటూ ఇటూ కాలేదు. టీడీపీ తరపున బరిలో నిలబడిన వర్ల రామయ్యకు పదిహేడు ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. అందులో ఇద్దరు ఓటింగ్‌కు హాజరు కాలేదు. నలుగురు ఓట్లు చెల్లలేదు. దీంతో.. వర్ల రామయ్య పదిహేడు ఓట్లతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
తెలుగుదేశం పార్టీని ధిక్కరించి వైసీపీకి మద్దతు పలికిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేయడం.. వైసీపీకి ఓట్లు అవసరం లేకపోవడంతో.. వారు.. విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. తమ ఓట్లు చెల్లకుండా.. వేసి వెళ్లారు. మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం.. చెల్లని ఓట్లు వేశారు. వీరితో పాటు.. మరో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఓటు కూడా చెల్లలేదు. ఆమె టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య పేరు పక్కన టిక్ మార్క్ పెట్టారు. కానీ నిబంధనల ప్రకారం… ప్రాధాన్యత ఓట్లు వేయాలి.. ఒకటి.. రెండు..మూడు అంకెలు వేయాలి. పెద్దగా పోటీ లేకపోవడంతో ఎవరూ ద్వితీయ తృతీయ ప్రాధాన్య ఓట్ల జోలికి వెళ్లలేదు. తాము వేయాలనుకున్న అభ్యర్థి పక్కన ఒకటి గుర్తు పెట్టారు. కానీ ఆదిరెడ్డి భవాని మాత్రం టిక్ మార్కె పెట్టి ఓటు చెల్లకుండా చేసుకున్నారు.
తాజా విజయంతో… వైసీపీకి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉన్నట్లు అయింది. ఇంతకు ముందే విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఉన్న ఆరుగురిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. ఒకరు రాష్ట్రేతర వ్యక్తి. ప్రస్తుతం.. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో బలం మరింతగా తగ్గిపోయింది. ఇరవై రెండు మంది లోక్‌సభ ఎంపీలు.. ఆరుగురు రాజ్యసభ ఎంపీలతో.. వైసీపీ ఢిల్లీలో బలమైన రాజకీయ పార్టీగా నిలిచింది.