జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ అభ్యర్థికి ఓటు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతరుల ఓట్లు అవసరం లేదు. వారు ఓటు వేయమని అడిగి ఉండరు కూడా.. అయినా పోలోమంటూ పోయి మరి.. వైసీపీ అభ్యర్థికి ఓటు వేసి.. తన పార్టీ ఇజ్జత్‌ను తీసేశారు.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఓ వైపు.. జనసేన అధినేత ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూంటే.. ఓ మాదిరి కూడా మద్దతు ప్రకటించని ఎమ్మెల్యే… ప్రభుత్వానికి మాత్రం… సరెండర్ అయిపోయారు. వైసీపీకి ఓటు అవసరం లేదు కాబట్టి.. ఆయన ఓటు వేస్తారా.. లేదా అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. బహుశా.. వైసీపీ నేతలు కూడా పట్టించుకోని ఉండరు. కానీ ఆయన మాత్రం.. వైసీపీకి ఓటు వేసి తన ఉనికిని గట్టిగా చాటారు.
ఒకప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. 300 ఓట్లు తెచ్చుకున్న రాపాక వరప్రసాద్‌ను తర్వాత ఏ పార్టీ కూడా దగ్గరకు తీయలేదు. లక్కీగా.. పవన్ కల్యాణ్ దగ్గరకు రావడంతో ఆయన రాజోలు టిక్కెట్ కేటాయించారు. అనూహ్యంగా.. ఆయన ఒక్కరే గెలిచారు. ఇండిపెండెంట్‌గా ఆయన వందల్లో రాని ఓట్లు జనసేన అభ్యర్థిగా మాత్రం గెలుపొందేలా వచ్చాయి. అయితే.. పవన్ కల్యాణ్ కూడా గెలవలేదు.. తాను గెలిచాను కాబట్టి.. తాను పవన్ కల్యాణ్ కంటే గొప్ప అనుకునే ఫీలింగ్ లోకి వెళ్లిపోయిన ఆయన.. తర్వాత పవన్ పైనే విమర్శలు ప్రారంభించారు. మొదట్లో.. జనసేనకు కాస్త ఫేవర్‌గానే ఉన్నా… రెండు కేసులు నమోదయ్యే సరికి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు.
ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కాపాడుకోలేక జనసేన నాయకత్వం చేతులెత్తేసింది. ఆయన ఉంటే ఉన్నాడు.. లేకపోతే లేదన్నట్లుగా పవన్ కల్యాణ్ కూడా లైట్ తీసుకున్నారు. అందుకే.. అసెంబ్లీలో ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా.. పవన్ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా తీసుకుని రాపాక వరప్రసాద్.. పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. వైసీపీకి అవసరం ఉన్నప్పుడు… మాట సాయమో.. ఓటు సాయమో చేస్తే సరే అనుకోవచ్చు.. అవసరం లేకపోయినా వెళ్లి.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసి వస్తూంటే.. ఇక పవన్ మాత్రం ఏం చేయగలరు..?