కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూండటంతో.. ఏపీ సర్కార్ మళ్లీ లాక్ డౌన్ పై దృష్టి పెట్టింది. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా.. కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వరుసగా రెండు రోజులు.. నాలుగు వందలక కేసులుకుపైగా నమోదు కావడంతో.. కంగారుపడిన అధికార యంత్రాంగం… సడలింపులు తగ్గించడంపై దృష్టి పెట్టింది. ముందుగా అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో సూపర్ స్ప్రెడర్లు ఎక్కువగా ఉన్నారని గుర్తించారు. సడలింపులు కారణంగా.. ఒకరి నుంచి.. మరొకరికి… అలా.. పెద్ద ఎత్తున సోకుతూ పోతోంది. దీంతో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని గుర్తించారు.
అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే గన్‌మెన్.. మరో ప్రజాప్రతినిధి బంధువు.. ఇలా పలువురు చనిపోయారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఇతరులకు సోకింది. శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు.. ఒక్క కేసు కూడా ఉండేది కాదు. కానీ తర్వాత కేసులు బయటపడటం ప్రారంభమయ్యాయి. వలస కూలీల రాక తర్వాత… శరవేగంగా సెకండ్ స్టేజ్‌కి చేరుకుంది. దీంతో.. అక్కడా లాక్ డౌన్ విధించక తప్పలేదు. ప్రకాశం జిల్లాలోనూ సూపర్ స్ప్రెడర్లు ఎక్కువగా ఉన్నారని అంచనా వేసిన అధికారులు.. కీలక ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇప్పకే భారీగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను కట్టడి జోన్లుగా ప్రకటించారు. అక్కడ రాకపోకల్ని నియంత్రిస్తున్నారు.
ఏపీలో కొన్నాళ్ల కిందటి వరకూ.. కరోనా కంట్రోల్‌లోనే ఉండేది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో… దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. పరిస్థితులు మెరుగ్గా ఉండేవి. కానీ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. పెద్ద పెద్ద నగరాలు లేకపోయినా… మద్యం దుకాణాలు ప్రారంభించడంతో కరోనా కేసులు విజృంభించడం ప్రారంభించాయి. ప్రజాప్రతినిధులు సహా ప్రజలు కూడా కరోనా విషయాన్ని లైట్ తీసుకోవడంతో మళ్లీ ఆంధ్ర..లాక్ డౌన్ దిశగా వెళ్తున్నట్లుగా అయింది.