తెలంగాణ సీనియర్లలో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు దక్కబోతున్నాయి. గవర్నర్ కోటాలో ఇద్దరికి సీఎం కేసీఆర్ చాన్స్ ఇవ్వబోతున్నారు. ఒక సీటు నాయిని నర్సింహారెడ్డి పదవీ కాలం ముగియడంతో ఖాళీ కానుంది. ఇంకో సీటు రాములు నాయక్ పై అనర్హతా వేటుతో ఖాళీ అయింది. ఈ రెండు సీట్లలోఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నాయిని నర్సింహారెడ్డికే మళ్లీ ఎమ్మెల్సీ సీటు ఖరారు చేస్తున్నారని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో నాయిని తన అల్లుడు కోసం ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించి నాయిని విఫలమయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ తనకు చాలా హామీలిచ్చారని.. ఒక్కటి కూడా అమలు చేయలేదని.. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే.. మరిన్ని సమస్యలు వస్తాయన్న అభిప్రాయంతో ఎమ్మెల్సీ సీటుకు ఆయనను ఓకే చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండో ఎమ్మెల్సీ సీటును వరంగల్ కు చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. మాజీ స్పీకర్ మధుసుధనాచారి కూడా ఆశిస్తున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా.. కేసీఆర్ కుమార్తె కవితకు చాన్సిచ్చారు. ఆ ఎన్నిక వాయిదా పడింది. అయితే.. ఆమె ఎన్నిక లాంఛనమేఅవుతుందని చెబుతున్నారు.