తెలంగాణ సర్కార్‌కు మద్యం అమ్మకాల కిక్ అందడం లేదు. మామూలు రోజుల్లో వచ్చే ఆదాయం కూడా రావడం లేదు. మూడు జిల్లాల్లో మినహా అన్ని చోట్లా మద్యం అమ్మకాలు సగానికి సగం పడిపోయినట్లుగా తెలుస్తోంది. దానికి కారణం జనం దగ్గర డబ్బులు లేకపోవడమే. లాక్ డౌన్ ఎత్తేసే సమయానికి ఎండాకాలం ఫుల్ స్వింగ్‌లోఉంది. సాధారణంగా.. అలాంటి సమయంలో..బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ అనూహ్యంగా.. బీర్ల అమ్మకాలు 44 శాతం మేర తగ్గిపోయాయి. గత ఏడాది 2019 జూన్ ఒకటో తారీఖు నుంచి 17 వరకు సుమారు 30 లక్షల 20 వేల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది 2020 జూన్ ఒకటి నుంచి 17 తేదీ వరకు 17 లక్షల కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 44 శాతానికి బీర్ల అమ్మకాలు పడిపోయాయి.
ఇతర లిక్కర్ అమ్మకాలు కూడా అదే స్థాయిలో పడిపోయాయి. ప్రజలకు సంపాదన పడిపోవడం.. మద్యం అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ.. ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. పనులు పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు. అదే సమయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా అమ్మకాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసిన మొదటి రెండు రోజులు.. భారీగా కొనుగోలు చేసినా తర్వాత మాత్రం మద్యం దుకాణాల వద్ద జనం కనిపించడం లేదు.
అయితే..ఏపీతో సరిహద్దు ఉన్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం అమ్మకాలు ఇతర చోట్లతో పోలిస్తే..దాదాపుగా 40 శాతం మేర అధికంగా ఉన్నాయి. ఏపీలో అన్ని బ్రాండ్లు అమ్మడం లేదు. పైగా ధర కూడా చాలా ఎక్కువ. దాంతో తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనుగోలు చేసి.. ఏపీకి తరలించడం ఎక్కువయింది. దాంతోఆ మూడు జిల్లాలకు.. ఏపీ మార్కెట్ కలసి వస్తోంది.