ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పదో తరగతి పరీక్షల రద్దుకే మొగ్గు చూపింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ టెన్త్ పరీక్షలను నిర్వహిస్తామని నిన్నటి వరకూ ప్రకటించిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్..హఠాత్తుగా…పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల లాక్ డౌన్ విధిస్తూ ఉండటం.. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూండటంతో అన్ని వర్గాల నుంచి పరీక్షల రద్దుకు డిమాండ్లు వినిపించడం ప్రారంభించాయి. అసెంబ్లీ సమావేశాలే నిర్వహించలేని పరిస్థితి ఉంటే…లక్షల మంది విద్యార్థులు రాసే టెన్త్ పరీక్షలను ఎలా నిర్వహిస్తారన్న విమర్శలు వినిపించడం ప్రారంభించాయి. అందరి అభిప్రాయాలు తీసుకున్నామన్న ప్రభుత్వం…చివరికి రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం ప్రకటించింది.
కొద్ది రోజులుగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా..విపక్ష నేతలందరూ ఈ పరిస్థితుల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించడం తుగ్లక్ చర్య అని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అదే సమయంలో..తెలంగాణ,తమిళనాడు.పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు.. పరీక్షలను రద్దు చేశాయి. దీంతో ఏపీ సర్కార్‌పై ఒత్తిడి పెరిగింది. కరోనా లాక్ డౌన్ విధించక ముందు జరిగిన పరీక్షలే తప్ప..తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఒక్క పరీక్షకూడా జరగలేదు. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఏపీ సర్కార్ కొత్తషెడ్యూల్ ప్రకటించింది.
వచ్చే నెల రెండో వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. టెన్త్‌లో మొత్తం పదకొండు పేపర్లు ఉంటాయి. వాటిని ఆరుగా కుదించారు. ఎలా అయినా పరీక్షలునిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ పొరపాటున.. పరీక్షలు నిర్వహిస్తే.. విద్యార్థులకు కరోనా సోకితే…ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తాయన్న కారణంగా వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. పరీక్షలు రద్దు చేసిన తర్వాత అంతర్గత పరీక్షల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించే అవకాశం ఉంది.