కరోనాకు మందు లేదు…నివారణకు.. మాస్క్ ధరించడమే మార్గం అని ఇప్పటి వరకూ ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం… భారత ప్రముఖ ఫార్మా కంపెనీ.. అనేక పరిశోధనలు చేసి.. ఓ టాబ్లెట్‌ను సిద్ధం చేసినట్లుగా ప్రకటించింది. మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్ ఫవిపిరవిర్ ఫలితం చూపిస్తున్నట్లు తెలిపింది. కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు గ్లెన్ మార్క్ కంపెనీ చెబుతోంది. తాము కేంద్రంతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు తెలిపారు. అలాగే, ఒక్కో మాత్ర ధరను 103 రూపాయలుగా వెల్లడించింది. కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలనీ.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాలని సూచించింది.
క్లినికల్ ట్రయల్స్ సందర్భంలో కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనా లక్షణాలు స్వల్ప, మధ్య స్థాయిలో ఉన్న డయాబెటిక్, గుండెజబ్బు వ్యాధిగ్రస్తులు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చని కంపెనీ చెబుతోంది. నాలుగు రోజుల్లోనే వైరల్ లోడ్ తగ్గిస్తుందంటున్నారు. చాలా దేశాలు కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సిన్, మందులు కనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నో డ్రగ్స్‌ను కాంబినేషన్లో వాడుతున్నారు. ఈ సమయంలో గ్లెన్‌మార్క్ మెడిసిన్ ఉందని చెప్పడం.. దానికి కేంద్రం ఆమోదం దక్కడంతో ఎట్టకేలకు.., ఓ గోలీ అందుబాటులోకి రాబోతోంది.