తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ.., బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. వర్చువల్ ర్యాలీలో విమర్శలు గుప్పించారు దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు భగ్గుమన్నారు. ముఖ్యంగా ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు మండిపోయింది. ఆయన ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి.. నడ్డా విమర్శలపై మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎలా ఉన్నాయో చెప్పాలని.. అక్కడి పరిస్థితులు మీరు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను.. ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గతంలో ప్రశంసించిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు. కరోనా విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే అప్రమత్తమయ్యామని.. కేంద్రానికి విలువైన సూచనలు చేశామని గుర్తు చేశారు.
తెలంగాణలో పర్యటించి వెళ్లిన కేంద్ర బృందాలు.. మంచి నివేదికలు ఇవ్వడంతో.. ఆ బృందాలపైనా.. ఫిర్యాదులు చేశారని.. ఇది బీజేపీ నేతల నీచ సంస్కృతి అని మండిపడ్డారు. నడ్డా జాతీయ నాయకుడిలా కాకుండా.. గల్లీ లీడర్లా మాట్లాడారని విమర్శించారు. అదే సమయంలో.. తెలంగాణ బీజేపీ నేతలపైనా మండిపడ్డారు. తాము అప్రమత్తంగా లేకపోవడం వల్ల నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ నేతలు గెలిచారని.. దాంతో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. మరో మంత్రి హరీష్ రావు కూడా.. బీజేపీపై విరుచుకుపడ్డారు. కరోనా పై యుద్ధం చేస్తున్నామని.. సైనికులు, డాక్టర్లు ఒకటేనని బీజేపీ చెబుతోందని గుర్తు చేశారు. సరిహద్దు అంశాలైప ఎవరైనా కామెంట్లు చేస్తే.. వారి మానసిక స్థైర్యం దెబ్బతింటుందని విమర్శిస్తున్నారని.. ఇప్పుడు కరోనాపై పోరాడుతున్న రాష్ట్రాలపై విమర్శలు చేయడం.. రాజనీతి ఎలా అవుతుందంని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు.
కరోనా విషయంలో… దేశం మొత్తం ఒకేలా ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు.., బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆ రెండు కాకుండా.. ఇతర పార్టీలు పాలిస్తున్నరాష్ట్రాలు అంటూ.. విడిగా ఏమీ లేదు. అన్ని చోట్లా వ్యాప్తి చెందుతోంది. అయితే.. ఈ పరిస్థితుల్ని రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ నేతలు ఉత్సాహ పడటమే.. ఆశ్చర్యానికి కారణం అవుతోంది. ఎందుకంటే.. కరోనా విజృంభిస్తున్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే.. ఆ వైపు నుంచే… బీజేపీకి కౌంటర్లు వెళ్తున్నాయి.