ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నంను చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం.. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే.. హఠాత్తుగా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కరోనా కాలంలో రాజధాని తరలింపుపై ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు. జులైలో కరోనా కేసులు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని తరలింపుపై ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలేదు. ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలంటే ఇవన్నీ సద్దుమణగాలి. కరోనా తగ్గిన తర్వాతే రాజధానిపై మాట్లాడతామని పెద్దిరెడ్డి ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టింది. అది మండలిలో మళ్లీ ఆగిపోయింది. అయితే సాంకేతిక అంశాల ద్వారా.. ఆ బిల్లు పాసయిపోయినట్లుగానే భావించి.. త్వరలో.. రాజధాని తరలింపును ఏపీ సర్కార్ ప్రారంభిస్తుందని అనుకున్నారు. ప్రముఖ ఆర్కిటెక్టులను పిలిపించి.. విశాఖలో పర్యటన జరిపి.. కార్యాలయాలకు అవసరమైన స్థలాలు.. ఆర్కిటెక్చర్లను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్లో కూడా.. దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలను కొత్త రాజధానికి కేటాయించారు. ఈ పరిణామాల మధ్య.. . ఇక రాజధాని తరలింపును ఎవరూ అడ్డుకోలేరని అనుకున్నారు.
కానీ పెద్దిరెడ్డి అనూహ్యంగా రాజధాని తరలింపు విషయాన్ని కరోనాకు ముడి పెట్టడంతో… ప్రభుత్వం ఇప్పటికి వెనక్కి తగ్గినట్లుగానే కనిపిస్తోందని భావిస్తున్నారు. కరోనా కేసులు వల్ల.. మళ్లీ పలు చోట్ల లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. పాజిటివ్ కేసులు ఊహించనంతగా పెరుగుతాయని కూడా అంటున్నారు. ఇలాంటి సమయంలో.. రాజధానిని తరలించడం వల్ల.. లేనిపోని సమస్యలు వస్తాయని.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భావించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రాజధాని తరలింపును ఎవరూ అడ్డుకోలేరన్న జగన్ సర్కార్ పట్టుదలకు కరోనా తాత్కలికంగా అడ్డుకట్ట వేసిందని అర్థం చేసుకోవచ్చు. అయితే.. తరలించడం లేదని ఇలా బయటకు చెప్పి… హఠాత్తుగా ఓ ఫైన్ మాణింగ్… వైజాగ్‌కు వెళ్తున్నామనే ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదనే భావన కూడా ఉంది. ఎందుకంటే.. ఏపీ సర్కార్ అన్ని విషయాల్లోనూ ఇదే వ్యూహం అమలు చేస్తోంది మరి..!