ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఓ పరిశ్రమ పెట్టడానికి ఐజీవై ఇమ్యూనోలాజికల్స్ సంస్థ ముందుకొచ్చింది. దాంతో పులివెందులలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమయిందని చాలా మంది సంతోషిస్తున్నారు. ఐజీవై ఇమ్యూనో లాజిక్స్ సంస్థ .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్ … ఏపీ కార్ల్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. పశువులకు వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలి కుంటువ్యాధి, బ్రూసిల్లా, గొర్రెలకు సోకే వివిధ వ్యాధులకు వ్యాక్సిన్లు తయారు చేస్తామని ఐజీవై ఇమ్యూనోలాజికల్స్ చెప్పుకుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఆ పేరు ఎక్కడా వినలేదే.. అని పశువుల మెడిసిన్స్ రంగంలో ఉన్న వారు కాస్త ఆశ్చర్యపోయారు. హఠాత్తుగా వచ్చి మెడిసిన్స్ ఎలా తయారని అనుమానిస్తున్నారు.
ఐజీవై రెడ్డిగారి పరిశ్రమ ఆ ఫీల్డ్‌లో పెద్దగా ఎవరికీ తెలియదు..!
ఐజీవై ఇమ్యూనోలాజిక్స్ ఎంత పెట్టుబడి పెడుతుంది..? ఉత్పత్తి చేయడానికి అవసరమైన రీసెర్చ్… సామర్థ్యం ఆ కంపెనీకి ఉందా..? ఇప్పటి వరకూ ఆ సంస్థ ఏం ఉత్పత్తులు చేసింది..? ఎవరికి అమ్మింది..? లాంటి అనుమానాలు చాలా మందికి వచ్చాయి. కానీ స్పష్టతలేదు. ఆ సంస్థకు ప్రమోటర్, డైరక్టర్‌గా యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి ఉన్నారు. ఇంకో డైరక్టర్‌గా మోనా గుప్తా ఉన్నారు. లక్ష రూపాయల పెట్టుబడితో 2014లో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా.. ఇంటర్నెట్లో వివరాలు ఉన్నాయి. లింక్డిన్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉద్యోగులు ఉన్నట్లుగా చూపిస్తోంది. వ్యాక్సిన్ల తయారీ పరిశ్రమ అంటే… ముందుగా రీసెర్చ్ వింగ్ చాలా కీలకం. తయారు చేసేది పశువుల వ్యాక్సిన్లు. అవి కూడా..మనుషులు ఆహారంగా తీసుకునే కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి వాటికి ఇచ్చే వ్యాక్సిన్లు. ఆ విషయంలో చాలా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిశోధనా సామర్థ్యం ఈ సంస్థకు ఉన్నట్లుగా ఎక్కడా ప్రకటించుకోలేదు. ఈ సంస్థకు ఓ వెబ్ సైట్ ఉన్నా… దానిలో ఎలాంటి వివరాలు అప్ డేట్ చేయడం లేదు. తమ ఉత్పత్తుల ధరలు అంటూ.. 2017లో రేట్ చార్ట్ పెట్టారు కానీ.. తర్వాత్ అప్ డేట్ లేదు.
ఐజీవై రెడ్డిగారి పరిశ్రమలో ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టడం ఎందుకు..?
ఐజీవై ఇమ్యూనోలాజిక్స్ ఎలాంటి బ్రాండ్లు అమ్ముతుందో ఎవరికీ తెలియదు. ఫలానా రకం వ్యాక్సిన్స్ అమ్ముతామని చెబుతోంది కానీ.. ఇలాంటి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన వెబ్సైట్లలో ఐజీవో ఇమ్యూనోలాజిక్స్ కంపెనీ పేరు కనిపించడం లేదు. ఒక వేళ.. పూర్తి స్థాయిలో పులివెందులలో ఉన్న ఏపీ కార్ల్లోనే.. పరిశోధన.. అభివృద్ది.. ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందేమోనని భావిస్తున్నారు. అయితే… దీనికి ఏపీ ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం ఏమిటన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. పులివెందులలో పరిశ్రమ పెట్టాలనుకున్న ఐజివై ఆదినారాయణ రెడ్డి… సొంతంగా ఆ పరిశ్రమ పెట్టడం లేదు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వంతో కలిసి పెడుతున్నారు. అంటే ప్రభుత్వం కూడా ప్రజాధనాన్ని పెట్టుబడిగా పెడుతుంది. ఐజీవై రెడ్డి గారు ఎంత పెడతారు.. ప్రభుత్వం ఎంత పెడుతుంది అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన రూ. యాభై కోట్లు పెట్టుబడి పెడతారు అన్న లీక్ మాత్రం.. ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చింది. ఒప్పంద వివరాలు మాత్రం బయటకు రాలేదు.
పరిశ్రమ ప్రారంభించకపోతే పులివెందుల ప్రజలకు అన్యాయం చేసినట్లే..!
పులివెందులలో ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్ సంస్థను వైఎస్ హయాంలో ఏర్పాటు చేశారు. దానికి సెజ్ హోదా ఇచ్చారు. ఒకటి.. రెండు సంస్థలు పరిశోధనల కోసం ఒప్పందాలు చేసుకున్నప్పటికీ.. తర్వాత ఎవరూ ముందుకు రాలేదు. దాంతో.. దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెట్టి కల్పించిన మౌలిక సదుపాయాలన్నీ నిరుపయోగగంగా ఉన్నాయి. ఇప్పుడు.. అందులో.. రీసెర్చ్ ల్యాబ్.. ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని ఐజీవై ఆదినారాయణరెడ్డి ముందుకొచ్చారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ చూస్తే.. కాస్త సందేహాస్పదంగా ఉన్నా.. పరిశ్రమ పెడితే మాత్రం… పులివెందుల పారిశ్రామికంగా ఓ అడుగు ముందుకేస్తుంది. ప్రభుత్వ పెట్టుబడితోనే.. ఏదో ఒకటి చేసి.. లాభం పొందాలనుకుంటే మాత్రం… స్కాం అవుతుంది. పులివెందుల ప్రజల్ని మోసం చేసినట్లు అవుతుంది. మరో ఏడాది తరవాత ఈ ఐజీవై రెడ్డిగా సామర్థ్యం బయటపడే అవకాశం ఉంది.