నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు ప్రాణహాని ఉందని… నేరుగా అమిత్ షాకు.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ పార్టీ ఎంపీ.. తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర బలగాలతో రక్షణ కావాలని కోరడం చాలా అరుదు. అది కూడా.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఆయన.. ఇలా లేఖ రాసి.. జాతీయ మీడియాకు సైతం విడుదల చేసి.. తన ఉద్దేశాన్ని నేరుగా స్పష్టం చేశారు. ఆయన ప్రాణానికి ముప్పు ఎక్కడ వచ్చింది..? ఎందుకు వచ్చిందన్న దాని దగ్గర నుంచి ఏపీ పోలీసుల పనితీరు వరకూ.. అన్ని అంశాలపై చర్చ జరిగేలా.. రఘురామకృష్ణంరాజు ఆ లేఖని అంశాలను పొందు పరిచారు.
వైసీపీయేతర వ్యక్తులకు మాత్రమే చట్టం అమలు చేస్తున్న ఏపీ పోలీసులు..!
అయ్యన్నపాత్రుడు తనను ఏదో అన్నాడని సోషల్ మీడియాలో చూసినట్లుగా ఓ అధికారి ఫిర్యాదు చేస్తే నిర్భయ కేసు పెట్టిన పోలీసులు… పట్ట పగలు బొండా ఉమ, బుద్దా వెంకన్న లాంటి వారిపై హత్యాయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ రెండు ఉదాహరణలు మాత్రమే.. ఇలా చెప్పుకుంటూ పోతే.. వైసీపీ నేతలు చేసిన అరాచకాలు పోలీసుల కంట్లో పడలేదు. టీడీపీ నేతలు.. పెళ్లికి వెళ్లినా కేసులు నమోదయ్యాయి. పెద్ద నేతలకే ఇలాంటి కేసులు నమోదయ్యాయి. చిన్న కార్యకర్తలపై నమోదవుతున్న కేసుల సంఖ్య చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఎవరి ఇంటి మీద పోలీసులు పడతారో తెలియని పరిస్థితి. అదే వాలంటీర్లు చేస్తున్న అరాచకాలు.. రోడ్డెక్కి విలపిస్తున్న మహిళల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. పోలీసులకు పట్టడం లేదు. చట్టం అంతా.. వైసీపీయేతర వ్యక్తులకు మాత్రమే అమలు చేస్తున్నారు. పోలీసుల తీరుపై.. ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. రఘురామకృష్ణంరాజు స్వయంగా వైసీపీ నేత అయి ఉండి… ఆ పార్టీని ధిక్కరిస్తున్నందున.. ఆయనను కూడా వైసీపీయేతర వ్యక్తుల జాబితాలో చేర్చారు. ఆయనకు బెదిరింపులు వస్తున్నా.. .. పట్టించుకోవడం మానేశారు. స్వయంగా ఎంపీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
వైసీపీని కాదంటే ఎవరూ ఏపీలో తిరగలేరా..?
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరు చాలా కాలంగా విమర్శల పాలవుతోంది. రెండు సార్లు పోలీస్ బాస్ హైకోర్టు ఎదుట చేతులు కట్టుకుని బోనులో నిలబడాల్సి వచ్చింది. చంద్రబాబును విశాఖలో అడుగు పెట్టకుండా పోలీసులే చేసిన వైనం దేశం మొత్తాన్ని నివ్వెర పరిచింది. ఎక్కడికక్కడ… ఆయనను పర్యటించకుండా అడ్డుకుంటున్న వైనం కూడా చర్చనీయాంశం అవుతోంది. వైసీపీతో ఎవరు విబేధించినా.. వారి ఇళ్ల ముట్టడి.. ఎక్కడికి వెళ్లినా దాడులు సహజం అయ్యాయి. పోలీసులు ఎక్కడైనా నిమిత్రమాత్రులయ్యారు. ఇప్పుడు వైసీపీ నేతల దృష్టి.. రఘురామకృష్ణంరాజు మీద పడింది. నర్సాపురం వస్తే ఆయనపై దాడులు చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు. వైసీపీ రాజకీయం తెలుసు కాబట్టే.. ఆయన పోలీసుల సెక్యూరిటీ అడిగారు. వారు స్పందించకపోవడంతోనే.. స్పీకర్‌కు .. కేంద్ర హోంమంత్రికి లేఖ రాసినట్లుగా కనిపిస్తోంది.
ఏపీలో ఎంపీకే రక్షణ లేదని దేశానికి చెబుతున్నారా..?
ఎంపీనైన తాను ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం… వల్లనే ఢిల్లీకి రఘురామకృష్ణంరాజు లేఖ రాసినట్లుగా ఉన్నా.. ఆయన మాత్రం.. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని.. పక్కాగా ఢిల్లీకి చేరవేసినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసుల సాయంతో.. జరుగుతున్న రాజకీయ దాడులు.. మానవ హక్కుల ఉల్లంఘన.. వంటి అంశాలపై.. పరిశీలన జరిగేలా.. రఘురామకృష్ణంరాజు.. లేఖలో అంతరార్థలాలను పొందు పరిచారు. విపక్ష నేతలపై కేసులు.. దాడులు అంశాన్ని హైలెట్ చేయగలుగుతున్నారు. సొంత పార్టీని వ్యతిరేకంగా మాట్లాడిన వారికే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. మిగతా వారి పరిస్థితి ఏమిటన్న అంశంపై.. ఆయన ఇలా చర్చకు చెపుడుతున్నారని అనుకోవచ్చు.