గచ్చిబౌలిలోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అక్రమాలు మళ్లీ ఒక్క సారిగా తెరపైకి వచ్చాయి. ఉద్యోగ సంఘ నేతలు.. ప్రత్యక్షంగా.. పరోక్షంగా పెత్తనం చెలాయించే.. ఈ సొసైటీలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ప్రభుత్వ యంత్రాంగం మళ్లీ గుర్తించింది. నిజానికి ఈ గుర్తింపు ప్రక్రియ చాలా కాలంగా నడుస్తోంది. అప్పుడప్పుడు మాత్రమే తెరపైకి వస్తోంది. కొన్నాళ్ల కిందట… హడావుడి జరిగినా.. మళ్లీ ఇప్పుడు అక్రమాల నివేదిక బయటకు వచ్చింది. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ పాలక వర్గ సభ్యులు స్థలాలను బినామీ పేర్లతో దక్కించుకోవడమే కాదు.. ఇతర ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేసి.. ఇళ్లు నిర్మించుకున్నారని తేల్చారు. వీటన్నింటిపై ఏసీబీ లేదా.. మరో దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి సిఫారసు అందింది.
నిజానికి టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అక్రమాలపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. స్థలాల కేటాయింపులో గోల్ మాల్ జరిగిందని.. ఉద్యోగ సంఘ నేతల ప్రమేయం ఉందని.. రికార్డులన్నీ గోల్ మాల్ అయ్యాయన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇలా ఆరోపణలు తెరపైకి వచ్చినప్పుడల్లా .. ఉద్యోగ సంఘ నేతలు…. సొసైటీ పాలకవర్గ సభ్యులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు.. కూడా… కలెక్టర్ అక్రమాలన్నింటినీ గుర్తించినా… మళ్లీ దర్యాప్తునకే సిఫార్సు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసి ఉంటే.. సొసైటీ పాలకవర్గ నేతలు ఇబ్బంది పడేవారు… ఇప్పుడు.. ప్రభుత్వం మరో దర్యాప్తు చేయించాలి.. ఆ తర్వాత నివేదిక రావాలి.. దీనికి సమయం పడుతుంది కాబట్టి.. ఈ లోపు మళ్లీ వారు తమ మ్యాజిక్‌ను రిపీట్ చేసే అవకాశం ఉంది.
తెలంగాణ సర్కార్ కొద్ది రోజుల కిందట.. జీతాల తగ్గింపు విషయంలో ఎవరూ సవాల్ చేయకుండా.. ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఎంత కాలం జీతాలు తగ్గిస్తారో తెలియని పరిస్థితి. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో జీతాలివ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పుడిప్పుడే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కట్ చేసిన జీతాల కోసం కోర్టుకెళ్లాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో… హౌసింగ్ సొసైటీ వ్యవహారం తెరపైకి రావడంతో.. ఇక అందరూ.. సైలెంటయినట్లేనన్న చర్చ జరుగుతోంది. కారణం ఇది కాకపోతే.. ప్రభుత్వం హౌసింగ్ సొసైటీ అక్రమాలపై కొరడా ఝుళిపించడం ఖాయమే.