నువ్వే..నువ్వే.. అనే సినిమాలో కానిస్టేబుల్ అయిన ఎంఎస్ నారాయణ.. బైక్ పై వెళ్లబోతున్న సునీల్, తరుణ్ ను ఉద్దేశించి ఏయ్ అని అరుస్తాడు. వెంటనే వారు బండి ఆపుతారు. కానీ.. నువ్ అరిచినందుకు ఆపలేదు.. అలా అరిస్తే… ఎవరూ ఆపరు అని చెప్పడానికి ఆగాం.. అని చెప్పేసి వెళ్లిపోతారు. ఇప్పుడు.. వైసీపీ – రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఇంతే ఉంది. చర్యలు తీసుకుంటాం అని వైసీపీ నుంచి కీచుగొంతుతో హెచ్చరికలు వస్తున్నాయి. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం.. గంభీర స్వరంతో రచ్చ చేసేస్తున్నారు.
మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను అఘామేఘాలపై సస్పెండ్ చేశారు. నిధుల్లేవన్న నగరి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసి పారేశారు. ప్రభుత్వంలో ఇలాంటి ధిక్కార స్వరాలను సహించే పరిస్థితి లేదని.. సంకేతాలను చాలా బలంగా పంపారు. కానీ పార్టీలోనే వైరస్‌లా పెరిగిపోతున్న అసంతృప్తిని మాత్రం.. తొలగించాడనికి .. వేటు వేయాడనికి జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలక పార్టీ పరిస్థితి ఇది. రఘురామకృష్ణంరాజు వైసీపీకి చేస్తున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా.. ఓ మాఫియా ఏపీని రాజ్యమేలుతోందన్న అభిప్రాయాన్ని ఆయన కల్పించేలా.. రాజకీయం చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు.. ఆయన దిష్టిబొమ్మలు తగుల బెట్టడం… కనిపిస్తే దాడులు చేస్తామని హెచ్చరించడం తప్ప.. ఏమీ చేయలేకపోతున్నారు.
రఘురామకృష్ణంరాజుకు ఇంత వరకూ కనీసం ఒక్క షోకాజ్ నోటీసు కూడా జారీ చేయలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా కోరలేదు. పార్టీ లైన్ ను ధిక్కరిస్తే. బహిష్కరిస్తామని కూడా హెచ్చరించలేదు. అప్పుడప్పుడు.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి నేత మీడియా ముందుకు వచ్చి.. జగన్ సీరియస్ అయ్యారు.. రఘురామకృష్ణంరాజును ఉపేక్షించం అని చెప్పి వెళ్తూంటారు. ఇలా చెప్పి వెళ్లిన తర్వాత నర్సాపురం ఎంపీ మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. చివరికి ప్రాణహాని ఉందని.. కేంద్ర హోంమంత్రికి కూడా లేఖ రాయడం.. వైసీపీ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదే. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు.
రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటే..ఆయన వెళ్లి బీజేపీలో చేరిపోతారన్న చర్చ వైసీపీలో జరుగుతోందంటున్నారు. కానీ ఆయన ఒక్కరే కాదని… గుంభనంగా ఇంకా పలువురు ఎంపీలు ఉన్నారన్న అనుమానంతోనే.. ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని అంటున్నారు. ఇప్పటికే.. ధర్మాన, ఆనం సహా పలువురు అసంతృప్తి స్వరాలు బయటకు వినిపిస్తున్నాయి. ఒక్క సారి అగ్గి రేగితే.. తగ్గించడం కష్టం అన్న అభిప్రాయంతో.. ఎంత డ్యామేజ్ చేస్తున్నా.. రఘురామకృష్ణంరాజును చూసీచూడనట్లుగా ఉంటున్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో నర్సాపురం ఎక్స్‌ప్రెస్ చాలా డ్యామేజ్ చేస్తోంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలో.. ఆ పార్టీకి తెలియడం లేదు.