సరిహద్దులలో చైనా సైనికుల ఉన్మాదం కారణంగా వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన ఐదు కోట్ల సాయాన్ని స్వయంగా అందచేశారు. సంతోష్ బాబు భార్యకు రూ. నాలుగు కోట్ల చెక్ ను.. ఆయన తల్లిదండ్రులకు రూ. కోటి చెక్‌ను అందచేశారు. హైదరాబాద్ షేక్ పేట పరిధిలోని జూబ్లిహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని కూడా.. నివాసం కోసం కేటాయించారు. ఆ పత్రాలను కూడా అందించారు. ఆలాగే సంతోష్ బాబు భార్యకు.. గ్రూప్ వన్ అధికారిణిగా నియమించిన ఉద్యోగ పత్రాలను కూడా అందించారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా సూర్యాపేటకు వెళ్లారు. సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. అందరితోనూ.. మాట్లాడారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముందుగా సంతోష్ బాబు ఇంటి ముందు ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులు అర్పించారు. సంతోష్ బాబు పార్థీవదేహం కశ్మీర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సమయంలో.. కేసీఆర్ నివాళి అర్పించలేకపోయారు. ఆ తర్వాత సూర్యాపేటకూ వెళ్లలేకపోయారు. ఈ కారణంగా పలువురు విపక్ష నేతలు… కేసీఆర్ తీరుపై విమర్శలు చేశారు.
ఈ క్రమంలో కేసీఆర్… ఆ కుటుంబం గురించి ఆలోచించి.. రూ. ఐదు కోట్ల సాయం.. ఇంటి స్థలం.. గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. తానే స్వయంగా వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చి.. సాయాన్ని అందచేయాలని నిర్ణయించుకుని.. ఆ మేరకు షెడ్యూల్ ఖరారు చేసుకుని.. సూర్యాపేట వెళ్లారు. విమర్శలు చేస్తున్న వారికి దీటైన సమాధానం చెప్పారు.