నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బీజేపీ నేతలైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో రహస్య మంతనాలు జరిపారంటూ.. ఎన్టీవీ చానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో వీరి రహస్య సమావేశం జరిగిందని సీసీ టీవీ ఫుటేజీ వివరాలను బయట పెట్టింది. ఈ నెల పదమూడో తేదీన పదకొండు తర్వాత ఈ సమావేశం జరిగిందని.. ముగ్గురూ గంట సేపు మాట్లాడుకున్నారని.. ఎన్టీవీ ప్రకటించింది. ఆ మేరకు వాటిని ప్రసారం చేసి.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు… బీజేపీ నేతలతో చర్చలు జరపాల్సిన అవసరం ఏముందని.. ఆ చర్చల సారాంశం ఏమిటని సందేహాలు వ్యక్తం చేస్తూ కథనం ప్రసారం చేసింది.
ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ పదవిలో ఉన్నారో లేదో ఆయనకే తెలియదు. ఆయన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. హైకోర్టు ఆయనను కొనసాగించాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ వేయాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారనే సమాచారాన్ని ఎన్టీవీ లీక్ చేసింది. సాధారణంగా స్టార్ హోటళ్లలోని సీసీటీవీ ఫుటేజీ బయటకు రాదు. ఎంతోమంది వీఐపీలు.. పార్క్ హయత్‌కు వస్తూంటారు. వారి ప్రైవేసీని కాపాడటాన్ని.. హోటల్ యాజమాన్యం ప్రాధాన్యత అంశంగా తీసుకుంటుంది. ఏదైనా నేరం జరిగితే.. సాక్ష్యాల కోసం పోలీసులు అడిగితే మాత్రమే ఫుటేజీ ఇస్తారు. కానీ ఎన్టీవీకి మాత్రం.. టైమింగ్‌తో సహా ఆ సీసీ టీవీఫుటేజీ అందుబాటుోకి వచ్చింది. ఒక్క కెమెరా కాదు.. కామినేని, సుజనా చౌదరి ఒకే రూమ్‌లోకి వెళ్లే ఫుటేజీ కూడా ఉంది. అయితే.. నిమ్మగడ్డ ఆ రూమ్‌లోకి వెళ్లారో లేదో దృశ్యాలు లేవు.
ఓ వ్యూహం ప్రకారమే.. ఎన్టీవీకి ఈ దృశ్యాలను… పకడ్బందీగా లీక్ చేసి.. బీజేపీ నేతలే.. నిమ్మగడ్డ వెనుక ఉన్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో పెట్టేందుకు వాడుకున్నారని అనుమానిస్తున్నారు. కామినేని శ్రీనివాస్.. నిమ్మగడ్డను తొలగించడంపై హైకోర్టు.. సుప్రీంకోర్టుల్లోనూ పిటిషన్లు వేశారు. నిజంగా.. కామినేని, సుజనాలతో రమేష్ కుమార్ భేటీ అయ్యారా… లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ఎన్టీవీ మాత్రం గంట పాటు చర్చలని డిక్లేర్ చేసింది. ఓ పద్దతి ప్రకారం.. దీన్ని హైలెట్ చేసే వ్యూహంలోనే.. వైసీపీ తన అనుకూల మీడియాలో ప్రసారం చేసిందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంటే.. ఈ వీడియో కేంద్రంగా ఇక రాజకీయం రాజుకునే అవకాశం కూడా ఉందని అనుకోవచ్చు.