పత్రికా స్వేచ్ఛ అనే పదాన్ని పరిహాసం చేసే మేధావుల సంఖ్య ఈమధ్య బాగా పెరుగుతోంది. బ్రిటన్ లోని ది ఇండిపెండెంట్ అనే పత్రిక ముంబై పేరును బాంబే అనే రాయాలని నిర్ణయించింది. ముంబై అనేది హిందూ జాతీయ వాదానికి సంబంధించి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని పత్రిక సంపాదకుడు అమోల్ రాజన్ ఘనంగా ప్రకటించాడు.
అది హిందూ జాతీయ వాదమే అయి ఉంటే, అది తప్పని ఏ చట్టంలో ఉంది? ఏ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయన ఒక భావజాలంతో ఉన్నారు. హిందూ జాతీయత అనే భావజాలం ఆయనకు నచ్చదు. అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన పుట్టింది కలకత్తాలో. దానిపేరు కోల్ కతాగా మారింది. దాన్ని మార్చింది కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి వామపక్ష భావజాలం తప్పని ఏ జర్నలిస్టయినా తీర్పు చెప్పినట్టు మాట్లాడితే ఎంత మూర్ఖత్వం?
మన దేశంలో అధికారికగా నగరాల పేర్లు మార్చడం కొత్త కాదు. బాంబే పేరు ముంబైగా మార్చారు. మద్రాస్ చెన్నైగా మారింది. కతకత్తా కోల్ కతా అయింది. వాల్తేర్ విశాఖపట్నంగా మారింది. ఆయా నగరాల్లోని ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వాలు ఈ పనిచేశాయనే ఇంగితం కూడా ఇండిపెండెంట్ సంపాదకుడికి లేకపోయింది.
అమోల్ రాజన్ నివసిస్తున్నది ఇంగ్లండ్ లో. సామ్రాజ్యవాదానికి, జాత్యహంకారానికి పెట్టింది పేరు ఆ దేశం. ఒకప్పుడు వందకు పైగా దేశాలను చెరబట్టి, అక్కడి సంపదను దోచుకుని అరాచకాలు చేసింది ఆంగ్లేయులు. అలాంటి దేశంలో ఉంటున్న వ్యక్తి, సహనానికి మారుపేరైన భారత దేశం గురించి అవాకులు చవాకులు పేలడం పిల్ల చేష్ట. అంతే కాదు, అతి నీచమైన జాత్యహంకారాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. తన భావజాలమే సరైందన్నట్టు, ముంబై మీద, హిందూ జాతీయత మీద తీర్పు చెప్పేశారు.
భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ భిన్నకులాలు, మతాలే కాదు, విభిన్నమైన భావజాలం ఉన్న వారూ నివసిస్తున్నారు. హిందూ జాతీయ వాదులు, కమ్యూనిస్టులు, మధ్యే వాద సిద్ధాంతం గల వారూ ఇక్కడున్నారు. ఎవరి భావజాలం వారిది. ఎవరో కొందరి పిచ్చిచేష్టల వల్ల కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగి ఉండొచ్చు. అలాగని 125 కోట్ల మంది భారతీయులకూ సహనం లేదన్నట్టు మాట్లాడటం అవివేకం.
ముంబై అనే పరు ముంబాదేవి అనే ఆలయం వల్ల వచ్చింది. అమోల్ రాజన్ గొప్పదేశమని భ్రమిస్తున్న ఇంగ్లండ్ సామ్రాజ్యవాద పాలకులు ఆ నగరం పేరును బాంబేగా మార్చారు. స్వాతంత్ర్య వచ్చిన తర్వాత మళ్లీ ముంబైగా మార్చాలని అక్కడి ప్రజల్లో చాలా మంది కోరుకున్నారు. కాబట్టే పేరు మార్పు అనేది జరిగింది.
నగరాల పేర్లు మార్చినా, కోర్టులు, ఐఐటీలు, స్టాక్ ఎక్స్జేంజీలు ఇతర సంస్థలు పాతపేర్లనే వాడుతున్నాయి. దానికి కారణం, పరిపాలన సౌలభ్యం. బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్సేంజి, మద్రాస్ హైకోర్టు, మద్రాస్ ఐఐటీ వంటివి పాత పేర్లనే ఉపయోగిస్తున్నాయి. కానీ ఆ సంస్థలేవీ ఇండిపెండెంట్ వితండ వాదుల్లా ప్రజలను అవమానించే కారణాలు చెప్పలేదు. పరిపాలన సౌలభ్యం ఒక్కటే కారణం.
నిలువెత్తు జాత్యహంకారానికి నిదర్శనమైన దేశంలో బతుకుతున్న అమోల్ రాజన్ లోనూ అవే పోకడలు పెరిగినట్టున్నాయి. అయినా, ఆయన పత్రిక ముంబై అనే పదాన్ని ఎలా రాసినా మనకొచ్చే నష్టం లేదు. అయితే, భారతీయుల్లోని సహన గుణాన్ని చేతగాని తనంగా భ్రమించి పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు చేసే వారు పెరుగుతుందటమే బాధాకరం.