108 అంబులెన్స్‌ల నిర్వహణలో భారీ స్కాం జరిగిందని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. వందల కోట్ల స్కాం కాదని.. వందల కోట్లు మిగిల్చామని ప్రకటన చేసింది. పాత సంస్థ బీవీజీని తొలగించి.. కొత్తగా అరబిందో ఫౌండేషన్ సంస్థకు ఇవ్వడం వల్ల ఏడేళ్లలో ఏడేళ్లకు కలిపి రూ.213.87 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. టీడీపీ నేతలు.. విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో ఫౌండేషన్‌కు .. 108 కాంట్రాక్ట్ ను భారీగా రేట్లను పెంచి ఇవ్వడం ద్వారా కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ పత్రం విడుదల చేసింది. రివర్స్ టెండరింగ్‌లో ఆదా చేశామనే వాదన తెరపైకి తీసుకు వచ్చింది.
అసలు “108- అరబిందో” డీల్‌పై వస్తున్న ఆరోపణలేంటి..?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక 108 అంబులెన్స్ నిర్వహిస్తున్న.. బీవీజీ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీని తప్పించి.. అరబిందో ఫౌండేషన్‌కు అప్పగించింది. బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు.. నెలకు రూ. లక్షా 31వేల రూపాయలు చార్జ్ చేస్తుంది. బీవీజీని తప్పించిన కొత్త ప్రభుత్వం అరబిందో ఫౌండేషన్‌కు ఆ బాధ్యత ఇచ్చింది. వారికి ఒక్కో అంబులెన్స్‌కు రూ. లక్షా 78వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అంటే.. ఒక్కో అంబులెన్స్‌కు నెలకు రూ. 47వేలు ఎక్కువ ఇస్తారు. ఇలా 300 అంబులెన్స్‌లు ఉన్నాయి. అంటే.. ఏడాదికి రూ. 17 కోట్లు ఎక్కువ. అలాగే ఏపీ సర్కార్ కొత్తగా మరో 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. వాటి నిర్వహణకు మరింత ఎక్కువగా రూ. 2 లక్షల 21వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అంటే.. ఇక్కడ ఏటా మరో రూ. 21 కోట్లు ఎక్కువ. పాత, కొత్త వాహనాలకు కలిపి ఏడాదికి రూ. 38 కోట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఏడేళ్లకు ఈ మొత్తం లెక్క వేసుకుంటే రూ. 266 కోట్లు అరబిందో ఫౌండేషన్‌కు ఎక్కువ చెల్లిస్తున్నట్లు అవుతుంది.
ప్రభుత్వం ఇచ్చిన వివరణలో మిగులు ఎలా వచ్చింది..?
2020 జనవరి 8న రివర్స్ టెండరింగ్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సంస్థను ఎంపిక చేశామని … నిర్వహణ కోసం కొత్త వాహనంపై రూ.3.12 లక్షలు, ప్రస్తుత వాహనంపై రూ.3.87 లక్షలు అవుతున్నప్పటికీ .. తాము నెలకు ఒక్కో కొత్త వాహనానికి రూ.1.78 లక్షలు, పాత వాహనానికి రూ.2.21 లక్షలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. అంటే.. రివర్స్ టెండరింగ్ వల్ల ఏడేళ్లకు కలిపి రూ.213.87 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం లెక్కలేసి వివరణను మీడియాకు పంపింది. వేతనాల పెంపు, ఇతర నిర్వహణ ఖర్చు వల్ల 108 అంబులెన్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వివరణలో పేర్కొంది.
అరబిందో కష్టాలను తన కష్టాలుగా ప్రభుత్వం భావిస్తోందా..?
పెరిగబోయే నిర్వహణ ఖర్చులను అంచనా వేసి మరీ.. లెక్కలు చెప్పిన ప్రభుత్వం అరబిందో కష్టాలను తన కష్టాలుగా ఫీలవుతోందన్న అభిప్రాయం ఏర్పడింది. కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ ఏదైనా పెరగబోయే ఖర్చులు.. మిగలబోయే సంపదకు బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకోదు. కానీ ఇక్కడ నిర్వహణ ఖర్చులు పెరగబోతున్నాయని అందుకే.. రేట్లు పెంచామని చెబుతున్నారు. అంబులెన్స్‌లో పని చేసే డ్రైవర్లు, ఇతర మెడికల్ టెక్నిషియన్లకు జీతాలు పెంచుతారని.. ఏడేళ్లలో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని,.. నిర్వహణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ రేటు కేటాయించాల్సి వచ్చిందని వాదిస్తోంది. పాత వాహనాలకు ఎక్కువ రిపేర్లు వస్తాయి కాబట్టి కొత్త, పాత వాహనాలకు వేర్వేరు రేట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ఇక్కడ కొత్త వాహనాలకే ఎక్కువ నిర్వహణ వ్యయం చెల్లిస్తూండటం కొసమెరుపు.
మొత్తానికి రివర్స్ టెండర్ల వల్ల ఇప్పటికి రెండు వేల కోట్ల వరకూ ఆదా చేశామని ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఆ జాబితాలో.. ఈ అరబిందో టెండర్లలో మిగిల్చిన రూ. రెండు వందల కోట్లు కూడా చేర్చడానికి అవకాశం ఏర్పడింది.