ముఖ్యమంత్రి జగన్ ఎవరినీ కలవరని.. ఆయన చుట్టూ కోటరీ ఉంటుందని… అందుకే తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటూ.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కొద్ది రోజులుగా రచ్చ చేస్తున్నారు. ఆయన ఆరోపణలను ఇతర నేతలు ఖండించారు. జగన్ అందర్నీ కలుస్తూంటారని ప్రకటించారు. నిజానికి వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్లు దొరకవనే అసంతృప్తి ఓ స్థాయి నేతల్లో కూడా ఉంది. 151 మందికిపైగా ఎమ్మెల్యేలు… ఉండటం… 28 మంది ఎంపీలు… ఇతర పదవుల్లో ఉన్న వారు పెద్ద సంఖ్యలో ఉండటంతో.. ముఖ్యమంత్రి వారిని అదే పనిగా కలవడం సాధ్యం కాదు.
ముఖ్యమంత్రి కూడా.. అవసరం లేకుండా ఎవర్నీ కలవాలనుకోరు. ఈ కారణంగా… ఏడాది కాలంలో సీఎంను కలవలేకపోయిన ఎమ్మెల్యేలు వంద మందికిపైగా ఉంటారని చెబుతూంటారు. వీరందరిలోనూ అసంతృప్తి ఉందన్న వాదన వినిపిస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహారంతో ఇది తెరపైకి రావడంతో… సీఎం కాస్త మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గత రెండు, మూడురోజులుగా ఆయన ఎంపీలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సహా మరికొంత మందికి అపాయింట్మెంట్లు ఇచ్చారు. వారితో మాట్లాడారు. వారు అడిగిన పనులు మంజూరు చేయడానికి అంగీకరించారు.
అలాగే… వచ్చే కొద్ది రోజుల పాటు.. రోజుకు మరికొంత మంది ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మార్పుతో వైసీపీ నేతల్లో కాస్త ఉత్సాహం వచ్చింది. తమ నియోజకవర్గాలకు ఏమైనా చేద్దామని ఆశ పడుతున్న వారు.. ఇప్పటి వరకూ.. ఎలాంటి దారి దొరక్క.. ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జగన్కు నేరుగా చెప్పుకునే అవకాశం వస్తూండటంతో.. ప్రతిపాదనలు సిద్దం చేసుకుంటున్నారు.