మొత్తానికి `హిరణ్య` ప్రాజెక్టు మెల్లమెల్లగా ముందుకు వెళ్తోంది. ఈ స్క్రిప్టుపై దాదాపు రెండేళ్ల నుంచీ కష్టపడుతున్నాడు గుణ శేఖర్. ఈ సినిమా రానా ఒప్పుకుని కూడా చాలా కాలం అయ్యింది. అయితే మిగిలిన అన్ని సినిమాల్నీ పట్టాలెక్కిస్తున్నాడు గానీ, `హిరణ్య`ని పట్టించుకోలేదు. దాంతో `హిరణ్య` ఉంటుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వీటికి పుల్ స్టాప్ పెట్టేశాడు సురేష్ బాబు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, స్క్రిప్టు పూర్తిగా సిద్ధం అయ్యాకే ఈ సినిమాని మొదలెట్టాలని భావించామని, అందుకే ఆలస్యం అయ్యిందని క్లారిటీ ఇచ్చారు.
ప్రతీ సినిమాకీ ప్రీ ప్రొడక్షన్ అతి ముఖ్యమైన ప్రక్రియ. స్క్రిప్టు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్, సెట్స్ ప్రాపర్టీ ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్లోనే ఫిక్సవుతాయి. అయితే స్క్రిప్టు వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులకు బడ్జెట్ అవసరం లేదు. అది కేవలం క్రియేటివ్ పార్ట్ అంతే. కానీ `హిరణ్య` కోసం మాత్రం ప్రీ ప్రొడక్షన్ కోసం ఇప్పటి వరకూ ఏడెనిమిది కోట్ల వరకూ ఖర్చయ్యిందట. హాలీవుడ్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ప్రీ ప్రొడక్షన్ నుంచే ఖర్చు మొదలవుతుంది. హాలీవుడ్ టాప్ స్క్రీన్ ప్లే రైటర్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నార్ట. ఈ సినిమా కోసం అక్కడ ఓ టీమ్ ఉంది. వాళ్లందరి జీత భత్యాలు ప్రీ ప్రొడక్షన్ నుంచే ఇవ్వాల్సివుంటుంది. అందుకే అంత ఖర్చయ్యిందట. ఈ సినిమాకి దాదాపు 200 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నారు. దాంతో పోలిస్తే ప్రీ ప్రొడక్షన్ తక్కువలో పూర్తయినట్టే.