వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై చాలా మందికి ఆవేదన ఉంటుంది కానీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో కానీ.. ఆయన అనుచరుల్లో కానీ.. వైసీపీ నేతల్లో కానీ.. చివరికి జగన్ శ్రేయోభిలాషుల్లోనూ ఉండటానికి లేదు. ఉన్నా బయట పెట్టడానికి లేదు. కానీ ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు.. బయట పడుతున్నారు. ఇంత కాలం కడుపులో దాచుకున్న ఆవేదన అంతా.. ఒక్క సారిగా బయటకు వెళ్లగక్కేస్తున్నారు. రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టిన ఉండవల్లి అరుణ్‌కుమార్.. జనగ్ ఏడాది పాలనపై.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఎంత ఆవేశపడ్డారంటే… ప్రెస్మీట్లో ఫ్యాన్ గాలి కింద ఆయన ఉన్నప్పటికీ.. ఆవేశం కారణంగా.. వచ్చిన ఎమోషన్ వల్ల.. చెమటలు పట్టేసి..చొక్కా కూడా తడిచిపోయింది.
జగన్‌ది అసమర్థతేనని తేల్చిన మాజీ ఎంపీ..!
ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తాన్ని విమర్శించాలనుకున్నారు కానీ.. కొన్ని ప్రాధాన్యతా రంగాలపై దృష్టి సారించారు. అందులో ఇసుక ఒకటి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇసుక అందుబాటులోకి రాలేదని.. మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఇసుక లభించే గోదావరి జిల్లాల్లోనూ ఇసుక దొరకడం గగనం అవడంపై ఆయన మండిపడ్డారు. ఇసుక దొరకకపోవడం వల్ల.. జరిగే అనర్థాలను విశ్లేషించారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడటానికి ఇసుక కొరతే కారణం అన్నారు. పెద్ద ఎత్తున పేదలకు ఉపాధి దొరకకపోవడానికి కారణం ఇసుక కొరతేనని తేల్చారు. ఈ విషయంలో ప్రభుత్వ అమర్థత బయటపడిందని తేల్చేశారు. ఇళ్ల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపైనా మండిపడ్డారు. పదిహేనేళ్ల క్రితం..ప్రభుత్వం కట్టించిన ఇళ్లనే ఇంత వరకూ పంపిణీ చేయలేదని… విమర్శించారు. తక్కువ రేటు భూముల్ని ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి.. ప్రజలకు పంచడం చేతకాని తనమని విమర్శించారు.
న్యాయవ్యవస్థ జోలికి వెళ్లవద్దని జగన్‌కు హెచ్చరికలు..!
ఇక ప్రభుత్వం చేస్తున్న అప్పులపైనా మండిపడ్డారు. బడ్జెట్లో ప్రభుత్వం చెప్పిన నెల్సన్ మండేలా కొటేషన్లకు బయట చేస్తున్న దానికి పొంతన లేదన్నారు. ప్రభుత్వం పంచుతామన్న పథకాల లెక్కలను ప్రత్యేకంగా పుస్తకంలో రాసుకొచ్చి తీసుకొచ్చి వివరించారు. పథకాల కోసం రూ. 80,500 కోట్లు కావాలని.. .ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. అప్పులు అన్ని వేళలా దొరకవని ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటితే.. ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టదని తేల్చేశారు. అధికారులు అందరూ ఎల్వీ సుబ్రహ్మణ్యంలా ఉండరన్నారు. ప్రజలకు నిజాలు చెప్పాలని అబద్దాలు చెప్పకూడదని తేల్చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం… కోర్టులపై ప్రభుత్వం వైపు నుంచి చూపుతున్న నిర్లక్ష్యంమపైనా ఉండవల్లి జగన్ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. నిమ్మగడ్డ విషయంలో ఎందుకంత ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ ఎంత పవర్ ఫుల్లో.. పలు రకాల ఉదాహరణలను ఉండవల్లి తన ప్రెస్మీట్లో వివరించారు. కోర్టుల జోలికి వెళ్లవద్దని అంతర్లీనంగా.. తన మాటల ద్వారా.. ఉండవల్లి సందేశం పంపారు. ఆయన న్యాయవాది కాబట్టి.. ఆ పద్దతిలోనే చెప్పారు.
ఏదీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవులు..!
మద్యం తాగేవారితో మాన్పించడానికి రేట్లు పెంచుతున్నామని చెబుతున్న ప్రభుత్వ వాదనలోని గాలిని.. ఉండవల్లి తీసేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం… బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం కూడా నిషేధమని గుర్తు చేశారు. ఎన్ని సార్లు రేట్లు పెంచినా సిగరేట్లు తాగేవారు తగ్గడం లేదు. రేట్లు పెంచితే తాగేవారు తగ్గుతారని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపైనా ఉండవల్లి మండిపడ్డారు. పాలకులకు ప్రజలు కనిపించాలి కానీ.. ప్రత్యర్థులు కాదని… ఏదీ శాశ్వతం అని భావించకూడదని హితవు పలికారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ .. ప్రభుత్వ అనుసరస్తున్న ప్రతీ విధానాన్ని తప్పు పట్టారు. ఆయన నేరుగా వైసీపీ సభ్యుడు కాకపోయినప్పటికీ.. జగన్ శ్రేయోభిలాషిగానే అందరూ గుర్తిస్తారు. ఇటీవలి కాలంలో.. స్వపక్షం వారుగా భావిస్తున్న వారిలో రఘురామకృష్ణంరాజు తర్వాత ఉండవల్లినే ఘాటు వ్యాక్యలు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు వెనుక చంద్రబాబు ఉన్నారని.. ఆరోపించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఉండవల్లి వెనుక కూడా… చంద్రబాబు ఉన్నారని అంటారేమో చూడాలి..!