క్లాస్ టచ్ ఉన్న దర్శకుడు గౌతమ్ మీనన్. అయితే చాలా కాలంగా ఆయనకు హిట్స్ లేవు. తీసిందల్లా ఫ్లాపే. ఆయన తన టచ్ కోల్పోయి.. ఏదేదో తీస్తున్నాడు. అయితే… తన కెరీర్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. నటుడిగా.. పుష్కలమైన అవకాశాలొస్తున్నాయి. ఇటీవలే ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారాయన. ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. అప్పటి నుంచీ ఆ తరహా సీరియస్ రోల్స్ గౌతమ్ మీనన్ ని వెదుక్కుంటూ వెళ్తున్నాయి. `ట్రాన్స్’ అనే మలయాళ చిత్రంలో విలన్‌గా నటించారు గౌతమ్. ఆ సినిమాలో నటనకూ కితాబులు అందుకున్నాడు. అటు తమిళ, కన్నడ చిత్రాల నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులోనూ ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు గౌతమ్. కొంతమంది నటులు.. తరవాతి కాలంగా దర్శకులుగా మారి, అక్కడే బిజీ అయి, స్థిరపడతారు. కానీ దర్శకత్వం నుంచి నటన వైపుకొచ్చి, అందులో సెటిలైనవాళ్లు చాలా తక్కువ. కానీ.. గౌతమ్ ని చూస్తుంటే, నటుడిగా సెటిలైపోవడానికి డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.
“నాలో నటుడున్నాడన్న సంగతి నాకు నిజంగా తెలీదు. సరదాగా కొన్ని ప్రయత్నాలు చేశాను. అవన్నీ నా మనసుకి నచ్చాయి, ప్రేక్షకులకూ నచ్చాయి. నటన, దర్శకత్వం ఏదైనా సరే, సినిమాలో భాగమే కదా. అందుకే నటననీ ఆస్వాదిస్తున్నా” అంటున్నాడు గౌతమ్.