సరైన న్యాయసలహాలు మీకు అందడం లేదు. అదే విషయాన్ని చెబుదామని హైకోర్టుకు పిలిపించామని .. డీజీపీకి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తప్పుడు న్యాయసలహాల వల్లే అధికారులు అదే పనిగా హైకోర్టు ఎదుట హాజరు కావాల్సి వస్తోందని కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికారులు అంటే… ప్రభుత్వం. ప్రభుత్వం తరపున జరిగే ఎాలంటి చట్ట ఉల్లంఘనలకైనా అధికారులు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికే బాధ్యత ఉంటుంది.
కొన్ని రోజులుగా ఏపీ హైకోర్టుల తీర్పులను సైతం పట్టించుకోని వాతావరణం ఉంది. దీనికి కారణం.. లీగల్ టీం ఇస్తున్న సలహాలే కారణమని భావిస్తున్నారు. ప్రభుత్వం న్యాయబృందం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని న్యాయవ్యవస్థకు బద్ద వ్యతిరేకిగా తీర్చిదిద్దేలా.. న్యాయ సలహాదారులు.. ఇతర బృందం… తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవని.. సామాన్యులు కూడా అంచనా వేయగలిగే అంశాలను.. సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లి.. ప్రభుత్వానికి మొట్టికాయలు వేయిస్తోంది… లీగల్ టీం. రంగుల విషయంలో అధికారులు అదే పనిగా కోర్టు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది.
చట్ట విరుద్ధమైన సలహాలతో.. హైకోర్టులోనూ.. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం పరువు పోయేలా చేస్తోంది లీగల్ టీం. అధికారులు బాధ్యలయ్యేలా సలహాలిస్తున్నారు. ఒక్క రంగుల విషయంలోనే కాదు.. ఇంగ్లిష్ మీడియం.. ఎస్ఈసీ విషయంలోనూ అదే పరిస్థితి. ప్రభుత్వం పెట్టుకున్న లాయర్లు.. న్యాయనిపుణులు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తూ.. అధికారులకు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. మూడో సారి డీజీపీకి కోర్టుకు హాజరైన కేసులో… కోర్టు చెప్పిందొకటి.. ప్రభుత్వ లాయర్ చేసిందొకటి. న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగలడం ఒకటి అయితే.. . కనీసం పిటిషన్లు, కౌంటర్లు కూడా కరెక్ట్ గా వేయడం రాకపోవడం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వానికి కోర్టుల్లో 65 సార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ నిర్ణయాలు చట్టపరంగా ఉండేలా చూసుకోవడంలో.. వాటిపై కోర్టుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వ లాయర్లు విఫలమయ్యారని స్పష్టమవుతోంది. గతంలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఓ తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు కప్పి పుచ్చుకోవడానికి న్యాయ బృందం.. రకరకాల విన్యాసాలు చేసి.. కోర్టులకు వెళ్లి మళ్లీ ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా.. కోర్టు తీర్పులను ధిక్కరించేలా.. చేస్తోంది కానీ.. సరైన సలహాలు ఇవ్వడం లేదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.