ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసి ఏడాది అవుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆ సమావేశాన్ని ప్రజావేదికలోనే నిర్వహించారు. ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో అమలు విజన్ గురించి ప్రకటించిన తర్వాత… మనం అక్రమ కట్టడంలో కూర్చున్నామని సంచలన ప్రకటన చేశారు. ప్రజావేదికను కూలగొట్టాలని ఆదేశించారు.
కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా.. సమావేశం పెట్టిన భవనాన్నే కూలగొట్టమని ఆదేశం..!
చట్టాలను.. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన మనం..ఇలా అక్రమ కట్టడంలో సమావేశం పెట్టుకోవడం… మంచిది కాదని.. సమావేశం ముగిసిన వెంటనే… ప్రజా వేదికను కూలగొట్టాలని ఆదేశించారు. అది అక్రమ కట్టడమో కాదో కానీ…వంద శాతం ప్రభుత్వ భవనం. ప్రజా ధనం దాదాపుగా రూ. ఎనిమిది కోట్లు వెచ్చించి.. దాన్ని అన్ని రకాల సమావేశాలకు ఉపయోగపడేలా నిర్మించారు. కొత్త రాజధానిలో మౌలిక వసతుల లేమి కారణంగా.. ఆ ప్రజా వేదిక భవనాన్ని అప్పటి సీఎం చంద్రబాబు .. ప్రభుత్వం తరపున భారీ సమావేశాలు నిర్వహించడానికి అనుకూలంగా నిర్మించారు. అలాంటి కట్టడాన్ని అక్రమ కట్టడంగా తేల్చేసిన సీఎం జగన్.. మరో మాట లేకుండా నేల మట్టం చేయించేశారు. దాదాపుగా రూ. ఎనిమిది కోట్లు ప్రజాధనం అక్కడ శిధిలంగా మారింది. కూల్చివేతకు మరో రూ. రెండు కోట్లు ఖర్చయిందని..చెబుతూంటారు. మొత్తంగా ప్రజావేదిక కూల్చివేత వల్ల రూ.పది కోట్ల ప్రజాధనం లాస్.
ఏడాది ఒక్క అక్రమ కట్టడాన్నీ కూల్చలేని ప్రభుత్వ పనితనం..!
ప్రజావేదిక కూల్చివేత సమయంలో.. కరకట్ట నుంచి లోపలికి ఉన్న నిర్మాణాలన్నీ .. పర్యావరణ, నదుల చట్టాలతో పాటు అన్ని రకాల నియమ నిబంధనలకు విరుద్దంగా నిర్మించినట్టుగా సీఎం జగన్ తేల్చారు. ప్రజావేదికతో ప్రారంభించి అన్నీ కూల్చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ.. ప్రజావేదిక తప్ప మరో భవనం జోలికి వెళ్లలేపోయారు. దానికి కారణం..అక్కడ ఉన్న నిర్మాణాలన్నీ..ప్రభుత్వ అనుమతులతోనే ..నిర్మించారు. ప్రతీ దానికి అనుమతులు ఉన్నాయి. నోటీసులు జారీ చేసి ప్రభుత్వం హడావుడి చేయడంతో.. చాలా మంది అనుమతి పత్రాలను..తమ ఇళ్ల గోడలకు అంటించారు. మరికొంత మంది కోర్టులకు వెళ్లారు. ఒక్క కరకట్ట మీదనే కాదు… రాష్ట్రంలో ఉన్న మరి ఏ ఒక్క అక్రమ నిర్మాణం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన ఆదర్శాలు..నీతులు ఇప్పటికీ.. అలాగే ఉండిపోయాయి. కానీ పది కోట్ల ప్రజాధనం శిథిలాల రూపంలో అక్కడే ఉండిపోయింది. విచిత్రం ఏమిటంటే… ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చే ప్రముఖులు ..జగన్ చెప్పిన కరకట్ట అక్రమ కట్టడాల్లోనే రెస్ట్ తీసుకుని… ఆయన ఇంటికి కలవడానికి వెళ్తూ ఉంటారు.
రెండు రోజుల్లో కూల్చేశారు.. ఏడాదిలో ప్రజాదర్భార్ కట్టలేకపోయారు..!
జగన్మోహన్ రెడ్డి అలాంటి సమావేశ మందిరాన్ని తన ఇంటి వద్ద నిర్మించాలనుకున్నారు. ప్రజాదర్భార్ అని పేరు పెట్టారు. నిధులు కూడా మంజూరు చేసుకున్నారు. ప్రజాదర్భార్‌లో తన తండ్రి వైఎస్ లాగా ప్రజలను కలవాలని అనుకున్నారు. కానీ ఏడాది కాలం ముగిసినా ఆ నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. అది ఒక్కటే కాదు.. గత ఏడాది కాలంలో.. ఒక్కటంటే.. ఒక్క మౌలిక సదుపాయల ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. దీన్నే టీడీపీ నేతలు ఎత్తిచూపిస్తూంటారు. కూల్చివేయడం క్షణాల్లో పని..కట్టడమే కష్టమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏడాది పాలనలో విధ్వంసమే జరిగిందని.. ఒక్కటంటే.. ఒక్కటైనా అభివృద్ది పని జరిగి ఉంటే చూపించాలని చాలెంజ్ చేస్తున్నారు. చట్టాల పట్ల ఎంతో విశ్వాసం ఉన్నట్లుగా గొప్ప గొప్ప మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు అవే చట్టాలను..న్యాయాలను.. చివరికి రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోకుండా పాలన చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
విధ్వంస పాలనకు సాక్ష్యంగా ఇప్పటికీ శిథిలాలు..!
దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా… ప్రజాధనం పట్ల జవాబుదారీగా ఉంటుంది. ప్రజా ధనమే కదా… వేస్ట్ అయిపోతే మాకేమి అని అనుకోదు. అందుకే… ప్రజాధనంతో కట్టిన ప్రజోపయోగ భవనాలను.. రాజకీయ కారణాలతో కూలగొట్టరు. ఎందుకంటే..అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ నిర్మాణాలు శాశ్వతం.. ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగపడతాయి. వారి ధనంతో కట్టిన భవనాలు వారికి ఉపయోగపడతాయి. అది అక్రమమా..సక్రమమా అన్నది తర్వాత ముందుగా ఓ సంపదను మాత్రం విధ్వంసం చేయాలని ఎవరూ అనుకోరు. అలాంటి ఆలోచనలు ఉంటే.. ప్రజాధనం పట్ల వారికి బాధ్యత లేనట్లే. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు అంతే కనిపిస్తున్నాయి. ఇంకా కొసమెరుపేమిటంటే… ప్రజా వేదిక కూలగొట్టిన శిథిలాలను కూడా ఇంత వరకూ ప్రభుత్వం తొలగించలేకపోయింది..కూలగొట్టి అలా వదిలేసింది. ప్రభుత్వ విధ్వంస పాలనకు సాక్ష్యంగా అక్కడ అవి కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజాధనం అంటే పాలకులకు అంత అలుసా అని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉన్నాయి.