పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. షోకాజ్ నోటీసు పంపిన విజయసాయిరెడ్డికి రివర్స్‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తూ..లేఖ పంపారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. పది రోజులుగా పార్టీని..పార్టీ అధినేతను.. పార్టీ ఎమ్మెల్యేలను కించ పరిచే విధంగా మాట్లాడుతున్నారని.. వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని లేకపోతే.. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి ఒక్కరోజులోనే స్పందిస్తానని చెప్పిన నర్సాపురం ఎంపీ… అదే వేగంగా విజయసాయిరెడ్డికి లేఖ పంపారు. అయితే.. నేను కాదు మీరే సమాధానం చెప్పాలని రివర్స్‌లో షోకాజ్ నోటీసుపంపినట్లుగా మ్యాటర్ ఉంది. నోటీసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఎలా ఉంటుందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచానని.. దానికి బదులుగా.. మరో పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని లేఖలో రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
అదే సమయంలో…తనను తాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి .. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని రిప్లయ్‌లో రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికపైనా…నర్సాపురం ఎంపీ తనదైన శైలిలో ప్రశ్నలు గుప్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో అసలు క్రమశిక్షణ సంఘం ఉందా? .. ఉంటే క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? .. క్రమశిక్షణ సంఘానికి చైర్మన్, సభ్యులు ఎవరు..? .. విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా… రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తే.. పార్టీపై కావాలని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగానే ఉందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి సమయంలో.. షోకాజ్ నోటీసుల పేరుతో.. ఆయనను మరింత రెచ్చగొడితే.. డ్యామేజ్ అయ్యేలానే సమాధానం ఇస్తారని.. ఏ కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికైనా అర్థం అవుతుందంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి రఘురామకృష్ణంరాజు ఇచ్చిన సమాధానం మొత్తానికే పార్టీని నవ్వుల పాలు చేస్తుందని అంటున్నారు. చేతికి అంటుకున్న ముక్కుకు అంటించుకున్నట్లుగా రఘురామకృష్ణంరాజును రెచ్చగొడుతున్నారన్న భావన వైసీపీలోనే వ్యక్తమవుతోంది.