తెలంగాణ ధనిక రాష్ట్రమేనని కేసీఆర్ మరోసారి తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులకు కొదవలేదని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ..తెలంగాణ ఆర్థికకష్టాల్లో ఉందని వస్తున్న వార్తలపై స్పందించారు. కరోనా వల్ల ఉద్యోగులకు రెండు, మూడు నెలలు పూర్తిగా జీతాలు ఇవ్వలేకపోయామని .. కొద్దిగా లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇవ్వగానే ఆదాయం పెరిగిందన్నారు. రైతుబంధు ఇచ్చేందుకే ఉద్యోగాలకు జీతాలు ఆపామని .. రైతుల దగ్గర డబ్బులు ఉంటే సమాజం దగ్గర ఉన్నట్టేనన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణ రైతుల్లో ధైర్యం వచ్చిందన్నారు. మొత్తానికి కేసీఆర్ చాకచక్యంగా ఉద్యోగుల జీతాలకు.. రైతు బంధుకు ముడి పెట్టేశారు. రైతుల కోసమే.. జీతాలు తగ్గించామని తేల్చేశారు.
రైతులకు లాభాలు తీసుకొచ్చేదే నియంత్రిత సాగు అని.. తేల్చి చెప్పారు. కాళేశ్వరం నీటి వల్ల రోహిణి కార్తెలోనే వరి నాట్లు వేసుకునే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామాలకు నిధులు ఇస్తున్నామని .. వర్షాల కోసం అడవులను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. మొక్కలు నాటాలి.. నాటిన వాటిని రక్షించాలని..కేసీఆర్ పిలుపునిచ్చారు. అడవుల్లో కలప దొంగలను వదిలేది లేదని తేల్చేసారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. మిషన్ భగీరథ వల్ల తాగునీటి కష్టాలు తొలగిపోయాయని.. తెలంగాణలో విద్యుత్ కష్టాలు పునరావృతం కావని ప్రజలకు హమీ ఇచ్చారు.
ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. అలాగే నర్సాపూర్‌లో అర్బన్ ఫారెస్ట్‌ను సీఎం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని కొన్నాళ్లుగా జరుగుతోంది. జీతాల తగ్గింపుపై ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. చివరికి వచ్చే నెల నుంచి పూర్తి స్థాయి జీతాలిస్తామని ప్రకటించారు. మొదటి నుంచి తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. దేశంలో మిగులు ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు.