వైసీపీ నేత పీవీపీపై హైదరాబాద్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. బంజారాహిల్స్లో ఉన్న ప్రేమ్ పర్వత్ విల్లాస్లో తన సొంత ఇంట్లో మరమ్మత్తులు చేయించుకుంటున్న కైలాష్ విక్రమ్ అనే వ్యక్తిపై పీవీపీ గూండాయిజం చేశారు. ఇంట్లో మార్పు చేర్పులు చేసుకోనీయకుండా అడ్డుపడ్డారు. బౌన్సర్లను తీసుకొచ్చి రౌడీ యిజం చేశారు. దాంతో కైలాష్ విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో.. పీవీపీ .. ఆయన అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిలిపించి ప్రశ్నిస్తున్నారు. మరో వైపు.. పీవీపీ తనను కూడా వేధించారంటూ..తిమ్మారెడ్డి అనే వ్యక్తి తాజాగా పోలీసుల్ని ఆశ్రయించారు.
గత ఏడాది సెప్టెంబర్లో తన కార్యాలయంలో పనిచేసే… ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డిని పీవీపీ బౌన్సర్లు కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకెళ్లారు. తిమ్మారెడ్డికి మూడురోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. తిమ్మారెడ్డి భార్య ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విత్డ్రా చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని.. పీవీపీతో తనకు ప్రాణహాని ఉందని తిమ్మారెడ్డి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీపీకి వివాదాలు కొత్తేం కాదు. గతంలో ఆర్థిక వివాదాల నేపధ్యంలో నిర్మాతగా మారిన బండ్ల గణేష్తోనూ ఆయన గొడవ పడ్డారు. తర్వాత ఆ విషయం పోలీస్ స్టేషన్కు వెళ్లింది.
తర్వాత ఇద్దరూ రాజీ పడ్డారో లేదో క్లారిటీ లేదు కానీ..సైలెంటయ్యారు. పీవీపీ టార్గెట్ గా .. బండ్ల గణేష్ అనేక రకాల ట్వీట్లు పెట్టేవారు. తాజాగా పీవీపీ… ప్రేమ్ పర్వత్ విల్లాస్ వివాదంతో మరోసారి పోలీసు రికార్డుల్లోకి ఎక్కారు. గత ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పీవీపీ..ఓడిపోయారు. ఆ తర్వాత పలుమార్లు వివాదాస్పద వ్యవహారాలతో తెరపైకి వస్తున్నారు.