వారం రోజుల వ్యవధిలో.. ఓ టీ టీలో రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి పెంగ్విన్, మరోటి కృష్ణ లీల. పెంగ్విన్ అమేజాన్ ప్రైమ్‌లో వస్తే, కృష్ణ లీల నెట్ ఫ్లిక్స్‌లో దర్శనమిచ్చింది. రెండు సినిమాల ప్రచార పర్వం చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. ‘పెంగ్విన్’ కోసం అమేజాన్ భారీ ఎత్తున ప్రచారం చేసింది. ప్రధాన దిన పత్రికలలో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చింది. థియేటర్ రిలీజ్ కి ముందు ఎలాంటి కసరత్తు ఉంటుందో.. అంతే కసరత్తు, ప్రచారం ఓటీటీ విడుదలకు ముందు కూడా సాగింది. కేవలం పబ్లిసిటీ కోసమే 3 నుంచి 4 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. దానికి తగిన ప్రతిఫలమే లభించింది. సినిమాకి నెగిటీవ్ టాక్ వచ్చినా, కావల్సినంత వ్యూవర్ షిప్ లభించింది. వ్యూస్ లెక్కన చూస్తే ‘పెంగ్విన్’ ఫలితం సంతృప్తిని కలిగించినట్టే.
కృష్ణ లీలది మరో కథ. ఈ సినిమా ఎలాంటి హడావుడీ లేకంఉడా.. నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఓటీటీలో ఈసినిమా వస్తుందని తెలిసినా.. ఎప్పుడు, ఎలా? అనే వివరం లేదు. సడన్ గా ఈసినిమా ఓటీటీలో కనిపించే సరికి సినీ ప్రేమికులు షాక్ తిన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అండ, దండ ఉన్న సినిమా ఇది. వాళ్లు అనుకుంటే, కావల్సినంత ప్రమోషన్ చేసుకోవొచ్చు. `పెంగ్విన్`లో కీర్తి లాంటి స్టార్ ఉంది. అదే దానికి పెద్ద ప్లస్. పబ్లిసిటీ లేకపోయినా పని అయిపోతుంది. `కృష్ణ లీల` అలా కాదు. స్టార్ బలం లేదు. ఇలాంటి సినిమాలకు పబ్లిసిటీ ముఖ్యం అనుకుంటారు. కానీ సురేష్ బాబు మాత్రం దానిపై దృష్టి పెట్టలేదు. విచిత్రం ఏమిటంటే.. ‘పెంగ్విన్’ కంటే.. ‘కృష్ణ లీల’కు కాస్త పాజిటీవ్ టాక్ రావడం. ఈ సినిమాని పబ్లిసిటీ ఇచ్చుంటే.. వ్యూవర్ షిప్ కూడా బాగుండేది. అసలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఓసినిమా విడుదల అవుతోంటే.. దానికి ఎలాంటి ప్రమోషన్ చేసుకోవాలి? ఎవరు చేయాలి? అనే విషయంపై మన నిర్మాతలకు పెద్దగా అవగాహన లేకుండా పోయింది. ఓటీటీ సంస్థలే ప్రమోషన్లు చేస్తాయా, లేదంటే నిర్మాతలు చేసి పెట్టాలా? అనే విషయంలోనూ క్లారిటీ లేదు. ముందస్తు ఒప్పందాల ప్రకారమే ఈ ప్రమోషన్లు జరుగుతాయన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. మున్ముందు ఓటీటీ విడుదలకు ఎలాంటి ప్రమోషన్లు ఉంటాయో, ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో చూడాలి.