తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి లేని కరోనా వైరస్‌ను ఉందని చెప్పే ప్రయత్నం చేశారని వస్తున్న విమర్శలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ భిన్నమైన వివరణ ఇచ్చింది. దీపక్‌రెడ్డికి కరోనా వైరస్ తగ్గిపోయి ఉండవచ్చని తేల్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డికి కరోనా సోకిందంటూ… ఓ టెస్టు రిపోర్టును ఆయనకు పంపారు. వెంటనే విజయవాడకు వచ్చి ఐసోలేషన్‌లో చేరాలని కృష్ణా జిల్లా కలెక్టర్ స్వయంగా దీపక్ రెడ్డికి ఫోన్ చేసి కోరారు. అప్పటికే హైదరాబాద్ వెళ్లిన దీపక్ రెడ్డి.. తనకు ఎలాంటి సింప్టమ్స్ లేకపోగా…చాలా కాలంగా స్ట్రిక్ట్ క్వారంటైన్లో ఉన్నానని తనకు వైరస్ సోకే అవకాశమే లేదని భావించి.. ఏఐజీ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నారు. ఏపీలో కరోనా టెస్ట్ రిజల్ట్ ఇచ్చిన రోజు రాత్రే ఆయన ఆ టెస్ట్ చేయించుకున్నారు. అందులో నెగెటివ్ వచ్చింది.
ఆ తర్వాత ఎందుకైనా మంచిదని మళ్లీ విజయా డయాగ్నోస్టిక్స్ లోనూ టెస్ట్ చేయించుకున్నారు. అక్కడా నెగెటివ్ వచ్చింది. దాంతో.. తనకు కరోనా సోకిందని…క్వారంటైన్‌కు పిలిపించి..కరోనా వైరస్ ఎక్కించేందుకు కుట్ర చేశారని దీపక్ రెడ్డి మండిపడ్డారు. కలెక్టర్ తీరుపై అనుమానం ఉందని .. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో తేల్చాలని డిమాండ్ చేస్తూ..వీడియో రిలీజ్ చేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో ఖచ్చితత్వం 67 శాతమేనని చెబుతూ.. సంబంధిత వ్యక్తిలో33శాతం వైరస్ ఉన్నా..నెగెటివ్ వస్తుందని చెప్పుకొచ్చింది. ఏపీలో టెస్టు చేసినప్పుడు.. కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వంద శాతం ఉందని..ఆయన రికవరీదశలో ఉండటంతో తగ్గిపోయి ఉంటుందన్న లాజిక్ వివరించారు.
ఆయనలో వైరల్ ఇన్ఫెక్షన్ స్థాయి 33 శాతం ఉన్నా..రికవరీ దశలో ఉన్నా..ఫలితాలు నెగెటివ్ అనే చూపుతాయని..వైద్య ఆరోగ్యశాఖ చెప్పుకొచ్చింది. అంటే.. దీపక్ రెడ్డికి కరోనా వచ్చి తగ్గిపోయిందని.. అందుకే ఫలితాలు నెగెటివ్ గా వచ్చాయని చెబుతోంది. అయితే.. ఒక్కరోజులో…. వైరస్ వంద శాతం నుంచి తగ్గిపోయే స్టేజ్‌కు ఎలా వెళ్తుందనేది.. మిస్టరీనే.