విజయసాయిరెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసుకు.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇచ్చిన రిప్లయ్ వైరల్ అయింది. అయితే.. ఆయన తన రిప్లైని ఒక్క విజయసాయిరెడ్డికి మాత్రమే పంపలేదు. అందులో.. వైసీపీకి సంబంధించిన కొన్ని మౌలికమైన అంశాలను లేవనెత్తి.. అటు ఎలక్షన్ కమిషన్‌కు.. ఇటు అన్నా వైఎస్ఆర్ పార్టీ అనే మరో పార్టీ అధ్యక్షుడికి కూడా కాపీ పంపారు. ఎలక్షన్ కమిషన్ అంటే సరే.. అనుకుందాం.. కానీ మధ్యలో ఈ అన్నా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందనేది.. చాలా మందికి ఆసక్తి కలిగిస్తోంది. అసలు ఆ పార్టీ ఉందని… నర్సాపురం ఎంపీకి ఎలా తెలిసింది..? తాను రాసిన లెటర్‌ను ఆయనకు ఎందుకు పంపారు..? దీని వెనుక ఏదైనా స్కెచ్ ఉందా..? ఇవే ఇప్పుడు చాలా మందికి వస్తున్న సందేహాలు.
అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ కావడానికి మూడు నెలల ముందుగానే గుర్తింపు పొందింది. ఈ పార్టీ అధ్యక్షుడు పేరు మహబూబ్ బాషా. ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పిలుచుకోవడానికి ఈసీ తనకే పర్మిషన్ ఇచ్చిందని చెబుతున్నారు. తనదే అసలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వాదిస్తున్నారు. ప్రస్తుత అధికార పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని.. తనది మాత్రం.. అన్న వైఎస్ఆర్ పార్టీ అని స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్ పేరుతో పిలుచుకునే పార్టీ తనదేనని తేల్చి చెబుతున్నారు. వైఎస్సార్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన అంటున్నారు.
మహబూబ్ బాషా గురించి ఎవరికీ తెలియదు. ఒక్క సారిగా రఘురామకృష్ణంరాజునే వెలుగులోకి తెచ్చారు. ఆయన కూడా గట్టిగా తనదే వైఎస్ఆర్ పార్టీ అని వాదించడం ప్రారంభించారు. అదే సమయంలో.. ఎన్నికల కమిషన్ కూడా.. రఘురామకృష్ణంరాజు రాసిన లేఖకు స్పందించిందనే వార్త కలకలం రేపుతోంది. దానిపై వివరాలు సేకరించాలని ఆదేశించిందని చెప్తున్నారు. రఘురామకృష్ణంరాజు లేఖలోని అంశాలను చూస్తే.. ఆయన చాలా పకడ్బందీగా అన్ని చట్టాలను వడబోసి.. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికికే టెండర్ పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న అబిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది. అందుకే.. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెరపైకి తెచ్చారంటున్నారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో..?