తెలంగాణ సర్కార్ బయట పెట్టుకోవడం కంటే.. దాచి పెట్టుకోవడమే మంచిదన్న విధానానికి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. కరోనా టెస్టుల శాంపిళ్ల సేకరణను రెండు, మూడు రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దాదాపుగా నలభై వేల శాంపిళ్లు సేకరించామని..వాటిని పూర్తి స్థాయిలో టెస్ట్ చేయాల్సి ఉన్నందున .. కొత్త శాంపిళ్లను సేకరించడం లేదని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది విపక్షాల నుంచి విమర్శలకు కారణం అవుతోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. వస్తున్న విమర్శలకు.. ప్రస్తుతం.. తీసుకున్న నిర్ణయం బలం చేకూరేలా చేస్తోంది.
దేశంలో ఏ రాష్ట్రం కూడా.. ప్రస్తుత పరిస్థితుల్లో శాంపిళ్ల సేకరణను నిలిపివేయాలని అనుకోవడంలేదు. అలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. రోజుకు ఆరేడు వందల పాజిటి్ కేసులు నమోదవుతున్న హైదరాబాద్‌లో.. అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేరు. వివిధ పద్దతుల్లో.. టెస్టులు చేసి.. వీలైనంతగా..వైరస్‌ను డిటెక్ట్ చేసి కంట్రోల్ చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని భావించారు కానీ.. ఇలా టెస్టులు నిలిపివేసి చేతులెత్తేస్తుందని అనుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సర్కార్ పై టెస్టుల విషయంలో హైకోర్టు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం.. రోజుకు వందల్లో కూడా టెస్టులు చేయలేదు. హైకోర్టు ఆగ్రహం తర్వాతనే టెస్టుల సంఖ్యను పెంచారు.
తెలంగాణలో కరోనా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతూండటంతో.. కేంద్రం మరో ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. ఇప్పటికి రెండు సార్లు ప్రత్యక బృందాలు వచ్చాయి. ఆ బృందాలు చాలా పాజిటివ్‌గా నివేదికలు ఇచ్చాయి. అయితే బీజేపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. పరిస్థితుల్ని అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.