తెరపై లిప్ లాక్‌ల సంస్కృతినే తెలుగువాళ్లు ఇంకా జీర్ణం చేసుకోవడం లేదు. అవేం ముద్దులూ..? అంటూ సంసార పక్షమైన ప్రేక్షకులు మూతి ముడుచుకుంటున్నారు. వెండి తెరపై ఆగ – మగ పెట్టుకునే ఉత్తుత్తి ముద్దులకే అలా అంటుంటే, నిజ జీవితంలో మగ – మగ లిప్ లాక్ ఇచ్చుకుంటే ఇంకేమైనా ఉందా? అదీ ఈ కరోనా టైమ్ లో.
ప్రభుత్వాలూ, సామాజిక సంస్థలూ.. సామాజిక దూరం అంటుంటే, ఏకంగా లిప్ లాక్ ఇచ్చేసుకున్నారు హీరో , దర్శకుడు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో `కృష్ణ అండ్ హిస్ లీల` సినిమా విడుదలైంది. జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ కాస్త పాజిటీవ్ టాక్ కే చిత్రబృందం తెగ ఖుషీ అయిపోతోంది. `తొలి ఓటీటీ బ్లాక్ బ్లస్టర్` అంటూ పోస్టర్లు గుద్దేసింది. అంతటితో ఆగలేదు. ఈ సంతోషాన్ని హీరో సిద్దూ, దర్శకుడు రవికాంత్ పేరేపూ తట్టుకోలే ఒకరినొకరు లిప్ లాక్ ఇచ్చేసుకున్నారు. ఓ హిట్టు కొడితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, లేదంటే కౌగిలించుకుంటారు. ఈ లిప్ లాక్కులేంట్రా బాబూ.. అంటూ టాలీవుడ్ జనాలు షాకైపోతున్నారు. హీరో, అండ్ హిస్ దర్శకుడి లీల.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ సినిమా విడుదలకు ముందు, విడుదలైన తరవాత ఎలాంటి ప్రచారం లేకుండా చప్పగా సాగుతోంది. ఈ లిప్ లాక్‌తో కావల్సినంత పబ్లిసిటీ వచ్చినట్టైంది.