మీరు మీరు కొట్టుకుని టీడీపీకి అవకాశం ఇవ్వవొద్దు..!. మీరు రాసిన లేఖ చాలు.. మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించడానికి..! ….ఇలాంటి మాటలు సాధారణంగా ఎవరు అంటారు. పార్టీ నేతలు అంటారు. ధిక్కరిస్తున్న పార్టీ నేతను బుగ్గరించడానికో.. హెచ్చరించడానికో చేస్తారు. కానీ.. ఈ వ్యాఖ్యలను.. అంతకు మించి వైసీపీ తరపున మీడియేటర్ తరహాలో వ్యాఖ్యలను టీవీ9 ప్రైమ్ టైమ్ యాంకర్ రజనీకాంత్ చేస్తున్నారు. వైసీపీలో రచ్చ చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పదే పదే డిబేట్లకు పిలిచి.. ఆయనను ఎదో విధంగా కాంప్రమైజ్ చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలో మీరు మీరు గొడవపడి టీడీపీ చాన్సివొద్దని ఓ సారి వ్యాఖ్యానించి అందర్నీ అవాక్కయ్యేలా చేశారు. నిన్నటికి నిన్న… పార్టీ నుంచి బహిష్కరించడానికి లేఖ చాలని.. నేరుగా రఘురామకృష్ణంరాజనే హెచ్చరించారు. దాంతో ఎంపీకి మండిపోయింది. తన పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినా.. రజనీకాంతా అని సూటిగా అడిగేశారు. తనకు అనిపించింది చెప్పానంటూ.. రజనీకాంత్ నీళ్లు నమలాల్సి వచ్చింది.
రవిప్రకాష్‌ను టీవీ9 నుంచి గెంటేసిన తర్వాత ఆ చానల్ బాధ్యతలను కొత్త యాజమాన్యం రజనీకాంత్‌కే ఇచ్చింది. ఆయన రవిప్రకాష్‌కు బాగా దగ్గరి వ్యక్తి అని తెలిసినా… టీవీ9 కొత్త యాజమాన్యం తనపై నమ్మకం పెట్టుకునేలా చేయడంలో రజనీకాంత్ సక్సెస్ అయ్యారు. ఓ దశలో.. రజనీకాంత్ డిబేట్లు .. ఔట్ డేటెడ్ అయ్యాయని.. కొంత కాలం పాటు పక్కన పెట్టేశారు. తర్వాత ఎలాగోలా మల్లీ స్క్రీన్‌పై స్పేస్ దక్కించుకున్నారు. అయితే.. తర్వాత టీవీ9 వాటాల అమ్మకాలతో రజనీకాంత్ దశ తిరిగింది. రవిప్రకాష్‌ను గెంటేయడంతో ఆయన కొత్త యాజమాన్యం విశ్వాసం పొందారు. ఇప్పుడు.. చక్రం తిప్పుతున్నారు. కొత్త యాజమాన్యం మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టి.. దానికి తగ్గట్లుగా వార్తలను.. డిబేట్లను.. మల్చడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
టీవీ9 కొత్త యాజమాన్యం అధికార పార్టీలకు కావాల్సిన వాళ్లు. అందుకే.. ఎక్కడా అధికార పార్టీలకు ఇబ్బంది కలిగించే వార్తలు రావు. ఇంకా కావాలంటే.. వారికి ఇబ్బంది కలిగిస్తే.. తానే ముందుండి పరిష్కరిస్తానంటూ.. డిబేట్ల ద్వారా తయారయ్యారు రజనీకాంత్. ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయారని… ఆయన డిబేట్లు చూస్తున్నవారు ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. జర్నలిస్టులకు సొంత వ్యక్తిత్వాలు ఉండవని.. యాజమాన్యం అవసరాలకు తగ్గట్లుగా మారాల్సిందేనని.. రజనీకాంత్ లాంటి వారిని చూస్తే అర్థమైపోతుందని అనుకుంటున్నారు.