రాజకీయాలంటే అంతే. దేశంలో ఏ ఎమోషన్ ఉందో తెలుసుకుని.. దానికి తగ్గట్లుగా రాజకీయం చేయాలి. అది ప్రజలకు ఉపయోగపడుతుందా..? లేదా అన్నదాని సంగతి తర్వాత. అందులో నిజానిజాలు ఎంత అన్నదాని సంగతి తర్వాత. ముందుగా.. ప్రజల ఎమోషన్‌ను క్యాచ్ చేసి.. ప్రత్యర్థి పార్టీని విలన్ని చేసేయాలి అంతే. ఇలాంటి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో యాంటీ చైనా ట్రెండ్ నడుస్తోంది… అందుకే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. మీడియా ముందుకు వచ్చింది.. కాంగ్రెస్ పార్టీని చైనా ఏజెంట్ అని తేల్చేశారు. అందుకు సాక్ష్యంగా ఓ పత్రం రిలీజ్ చేశారు. అదేమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి చైనా ఎంబసీ నుంచి నిధులు అందాయట. చైనా నుంచి నిధులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది కాబట్టి.. కాంగ్రెస్ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలంతా చైనా భావజాలంతో ఉన్నారని ఆరోపించారు.
ఇదే బీజేపీ.. గత కొన్నాళ్ల కిందట.. అంటే ఎన్నికలకు ముందు పాకిస్తాన్‌కు కాంగ్రెస్ పార్టీకి లింగ్ పెట్టేది. ఎన్నికలకు ముందు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత.. పాకిస్థాన్ – కాంగ్రెస్ వేర్వేరు కాదు అన్నట్లుగా ప్రచారం హోరెత్తించారు. దానికి బోలెడన్ని సాక్ష్యాలను బయట పెట్టారు. కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ లో సంబరాలు చేసుకుంటారని మోడీ, అమిత్ షా లాంటి వాళ్లు కూడా ప్రచారం చేశారు. అప్పటి ఎమోషన్ పాకిస్థాన్ కాబట్టి.. అలా పాకిస్థాన్‌కు.. కాంగ్రెస్‌కు ముడి పెట్టేసేవాళ్లు.. మంచి ఫలితాలు సాధించేవారు. ఇప్పుడు ఎమోషన్ చైనా కాబట్టి.. టర్నింగ్ తీసుకున్నారు. రేపు రెండింటి ఎజెంట్ కాంగ్రెస్ అన్న ఆశ్చర్యం లేదు.
చైనాకు భారత్ భూభాగాన్ని సమర్పించేశారని… భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న చైనాకు లొంగిపోయారని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. భారత భూభాగంలోకి చైనా సైనికులు ఎవరూ రాలేదన్న మోడీ ప్రకటనతో… అలా అయితే.. సైనికులు ఎలా చనిపోయారన్న చర్చ ప్రారంభమయింది. దీన్నే కాంగ్రెస్ ప్రధాన అస్త్రంగా చేసుకుంది. దీనికి కౌంటర్‌గా… బీజేపీ… చైనా నుంచి కాంగ్రెస్ పార్టీ నిధుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్‌పై ప్రచార దాడి చేస్తుంది. ఎమోషన్లో బీజేపీ విన్నర్ అవుతుంది.