విత్తనాలు మొలకెత్తకపోవడం.. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవడం.. సహా ఓ రైతు పంట చేతికి వచ్చే సరికి అనే గండాలను ఎదుర్కోవాలి. ఈ మధ్యలో పంట నష్టపోతే… పట్టించుకునేవారు ఉండరు. పంటల బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. రైతులను ఆదుకుంటున్నది అంతంత మాత్రమే. బీమా ప్రీమియం చెల్లించలేకపోవడం.. వివిధ రకాల ఆంక్షలు… షరుతులు కారణంగా.. రైతులకు పరిహారం దక్కేది కాదు. అయితే.. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్.. కొత్తగా ఆలోచించారు. రైతులకు ఒక్క రూపాయికే బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. కేంద్రం ఫసల్ బీమా యోజనను అమలు చేస్తోంది. ఈ పథకాన్ని పూర్తిగా ప్రభుత్వం అడాప్ట్ చేసుకుని.. రైతుల తరపున చెల్లించాల్సిన సొమ్మును కూడా చెల్లించాలని జగన్ నిర్ణయించారు. రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే.. సరిపోతుంది.
ఏపీలో ఉన్న దాదాపు అరవై లక్షల మంది రైతులకు ఉచిత బీమా పథకాన్ని వర్తింప చేస్తున్నారు. కామన్ సర్వీస్ సెంటర్లలో రైతులు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే అన్ని పంటలకూ ప్రభుత్వం నిర్ణయించిన బీమా వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లిస్తుంది. బ్యాంకుల ద్వారా లోన్ తీసుకునే రైతులకు కట్ అయిన బీమా ప్రీమియం నగదు సైతం తిరిగి చెల్లించింది. ఈ మేరకు నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఐదున్నర లక్షల మంది రైతుల అకౌంట్లలో ఆ నిధులు జమ అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఖరీఫ్ 2016 నుండి అమలుజరుగుతోంది. అయితే రైతులు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. 2019 నుండి రైతులందరి తరుపున పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది.ఈ సీజన్లో ఇప్పటికే బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు కూడా వారు చెల్లించిన ప్రీమియం ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు తిరిగి చెల్లించారు. ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు కేవలం ఒక రూపాయి నమోదు కోసం చెల్లించి, నిర్ధేశించిన గడువులోగా రైతులు తమ పంటలకు బీమా చేసుకోవచ్చు. ప్రభుత్వమే బీమా కంపెనీలతో టై అప్ అయి.. రైతులకు నష్టపరిహారం అందిస్తుంది. ఓ రకంగా ఈ పథకం రైతులకు బాగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు.