కాపు కార్పొరేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న లెక్కల మ్యాజిక్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. అందరికీ ఇచ్చే పథకాల్లో భాగంగా ఇచ్చే మొత్తాన్ని కూడా కార్పొరేషన్ ఖాతాలో వేసి లెక్కలు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. కాకి లెక్కలు చెబుతూ.. కాపుల్ని మోసం చేస్తున్నారన్న పవన్.. తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తే.. తాము రూ. రెండు వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి వైసీపీ అధికారంలోకి వచ్చిందని పవన్ గుర్తు చేశారు. గత 13నెలల కాలంలో 4700 కోట్లు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ నిధులను అందిరతో పాటు ఇచ్చారా.. కాపుల కోసం ప్రత్యేకంగా ఇచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు.
కాపు కార్పొరేషన్ విషయంలో ఏపీ సర్కార్ వ్యవహారశైలి… ఆ వర్గం నేతల్లో.. ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. కార్పొరేషన్ అనేది.. ప్రత్యేకం. దానికి కేటాయించే నిధులు. ఆ వర్గం యువత ఉపాధికి.. ఉపయోగపడేలా.. రుణాలు ఇవ్వాలి. కానీ ఏపీ సర్కార్ వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ల దగ్గర్నుంచి అమ్మఒడి వరకూ ..అందరికీ ఇచ్చే పథకాలను.. ఆ కార్పొరేషన్ కిందనే ఇస్తున్నట్లుగా ప్రకటిస్తోంది. దాంతో.. అసలు కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా.. కేటాయిస్తున్నారో లేదో తెలియడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కాపు కార్పొరేషన్ కింద రుణాలు.. స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుయ్యాయి. ఈ ప్రభుత్వంలో అలాంటివేమీ లేవు. సామాజిక పెన్షన్లు.. అమ్మఒడి నిధులను కాపు కార్పొరేషన్ కింద ఇస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు.
ప్రభుత్వం చేస్తున్న ఈ మాయ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ప్రభుత్వం కాపుల్ని ఘోరంగా మోసం చేస్తుందని అంచనా వేసుకుని పోరుబాట పట్టారు. తక్షణం కాపు కార్పొరేషన్ కు ఇస్తున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చేసుకుటున్న ప్రచారం వల్ల కులాల మధ్య చిచ్చు రేగే ప్రమాదం ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.